తన అహంకారాన్ని ప్రదర్శించుకోవడానికి, పోలీసులను ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ తననేమీ చేయలేరు.. అనే పొగరును చాటుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన రెంటపాళ్ల యాత్ర రెండు ప్రాణాలను బలితీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తోపులాటలో పార్టీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి, ఏకంగా జగన్ కారు కింద పడి చీలి సింగయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఒకవైపు జగన్ జనానికి కరచాలనాలు ఇస్తూ.. తనకోసం జనం కారుమీదికి కూడా ఎగబడి వచ్చేలాగా ప్రేరేపిస్తూ కారులోంచి బయటకు నిల్చుని ఓవర్ యాక్షన్ చేస్తూ ప్రయాణించారు. అదే సమయంలో.. చీలి సింగయ్య ఆ కారు ముందు చక్రం కింద పడితే.. కారు చక్రం కింద ఆయన తల ఉండగా.. అలా నెట్టుకుంటూ కారు కొంత దూరం వెళ్లింది. తర్వాత వైపీపీ కార్యకర్తలు సింగయ్యను కారుకింద నుంచి రోడ్డు పక్కన పడేశారు. పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా..సింగయ్య మరణించాడు.
తొలుత వేరే కారు కింద పడినట్టుగా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిన వైసీపీ కార్యకర్తలు అసలు సింగయ్య మరణం పోలీసుల వల్లనే జరిగినట్టుగా మసిపూసి మారేడుకాయ చేయడానికి నానా ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో.. స్వయంగా జగన్ ప్రయాణిస్తున్న కారు కిందనే పడి మరణించినట్టుగా స్పష్టమైన వీడియో ఆధారాలు వెలుగుచూశాయి. జగన్ ఒక నిందితుడిగా కేసులో చేరారు. కానీ జగన్ దళాలు మాత్రం ఈ కేసును పూర్తిగా పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాయి.
కార్యకర్తలు సింగయ్యను రోడ్డు పక్కన పడుకోబెట్టే సమయానికి ఆయన చాలా ఆరోగ్యంగా అద్భుతంగా ఉన్నారని, అంబులెన్సులో పోలీసులు తరలిస్తున్నప్పుడు ఏదో జరిగిందని ఆ తర్వాతే చనిపోయాడని వైసీపీ నేతలు చవకబారు ఆరోపణలు చేస్తూ వచ్చారు. అంబులెన్సు ఎక్కించిన తర్వాత.. పోలీసులే సింగయ్యను చంపేశారు అనే స్థాయిలో రంగు పులమడానికి వారు ప్రయత్నించారు.
ఇప్పుడు, సింగయ్య భార్య లూర్థు మేరీని జగన్ తన తాడేపల్లి పాలెస్ కు పిలిపించుకుని పది లక్షల రూపాయలు ఇచ్చారు. ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. లూర్థు మేరీ పాట మార్చారు. అంబులెన్సులోనే ఏదో జరిగిందని ఆమె కూడా అంటున్నారు. నిన్నటిదాకా వైసీపీ ఎలాంటి పాట పాడుతూ వచ్చిందో ఇప్పుడు లూర్థ మేరీ కూడా అదే పాట పాడుతున్నారు. ఇలా ఆమెతో తమకు అనుకూల పాట పాడించడం అనేది అంత సులువుగా ఏమీ జరగలేదని, ఆమెకు పది లక్షల రూపాయలు అధికారికంగా ఇచ్చిన నజరానాతో పాటు, మరో భారీ మొత్తాన్ని ఇందుకోసం ముట్టజెప్పారని తాడేపల్లి వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. సింగయ్య మరణానికి స్పష్టంగా జగన్ కారణం. అయితే ఆయన కావాలని చంపలేదనేది కూడా నిజం. అలాగని నేరం జరగలేదనలేం. పొరబాటు జరిగింది అని ఆయన లెంపలు వేసుకోవచ్చు. కానీ, ఇలా చవకబారుగా పోలీసులమీదికే మరణాన్ని నెట్టేయాలని కుట్రలు చేయడం, కుటిలత్వం ప్రదర్శించడం మాత్రం అసహ్యంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.
లూర్థు మేరీ నోట వైసీపీ పాట.. ప్యాలెస్ లో ఏం జరిగిందంటే?
Friday, July 11, 2025
