వైసీపీ తరఫున మీడియా ముందుకు వచ్చి జగనన్నను కీర్తిస్తూ మాట్లాడే వారి సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయింది. ప్రభుత్వం జగన్ చేతిలో ఉన్న రోజుల్లో ప్రతిరోజూ అనేక మంది మీడియా పులులు ఆ పార్టీలో కనిపించేవారు. ఇప్పుడు.. మాట్లాడవలసిన అంశాలపైకూడా మాట్లాడడానికి మనుషులు ఉండడం లేదు. ఎందుకంటే.. వైసీపీ నాయకులంతా ఏదో ఒకనాటికి తాము పార్టీకి రాజీనామా చేయకతప్పదనే స్పృహతో ఉన్నారు. ఏ క్షణాన ఏ పార్టీలోకి జంప్ చేయాల్సి వస్తుందో.. అని ఎవ్వరి గురించి నెగటివ్ గా నోరు మెదపకుండా సైలెన్స్ పాటిస్తున్నారు. అయితే ఇతర పార్టీల్లో చేరడానికి గతిలేని వారు మాత్రమే.. వైసీపీ తరఫున మాట్లాడుతుండడం విశేషం. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు మాట్లాడుతూ.. అసెంబ్లీకి వెళ్లకపోవడం వెనుక జగన్మోహన్ రెడ్డికి ఉండే అసలు ఫోబియాను బయటపెట్టారు.
సుధాకర్ బాబు మాట్లాడుతూ.. అసెంబ్లీలో జగన్ ప్రశ్నిస్తారేమోనని కనీసం మైకు కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. జగన్ గానీ, ఆయన అనుచర ఎమ్మెల్యేలు గానీ.. ఏనాడు సభకు వెళ్లారు గనుక.. వారికి మైకు ఇవ్వడం గురించి ప్రశ్నించడానికి అనేది జనం మదిలో మెదలుతున్న సందేహం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మరో ఆణిముత్యం లాంటి మాట చెప్పారు. ‘జగన్ పై ప్రతిరోజూ విషం కక్కుతూ ఉండే రఘురామక్రిష్ణ రాజుని డిప్యూటీ స్పీకరు పదవిలో కూర్చోబెట్టిన తర్వాత ఆ అసెంబ్లీ ఎలా జరుగుతుంది?’ అని అడుగుతున్నారు.
అంటే తనకు కిట్టని వ్యక్తులు, తన మీద సూటిగా విమర్శలు చేయగలిగిన వ్యక్తులు ఉంటే వారి ఎదుట ఉండడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కి సాహసం లేదని సుధాకర్ బాబు మాటలను బట్టి అర్థమవుతోంది. ఇన్నాళ్లూ జగన్ తనకు ప్రతిపక్ష హోదాకోసం పట్టుపట్టి రాద్ధాంతం చేస్తున్నారేమో అని అంతా అనుకుంటున్నారు. కానీ.. చూడబోతే.. తనను నిందించగల స్థాయిగల వారి ఎదుట నిలబడడం జగన్ కు నామోషీగా అనిపించినట్టుగా ఉంది. అసెంబ్లీకి వెళితే.. స్పీకరు అయ్యన్నపాత్రుడిని గానీ, డిప్యూటీ స్పీకరు రఘురామని గానీ ‘సర్’ అని పిలవాలి.
జగన్ తన రాజకీయ పార్టీని కార్పొరేట్ ఆఫీసులాగా నడుపుతూ.. తన తండ్రితో కలిసి పనిచేసిన, ఆయన సహచరులతో కూడా తనను సార్ అని పిలిపించుకుంటూ తన అహంకారాన్ని పుష్కలంగా ప్రదర్శించారు. తాజాగా టీజే సుధాకర్ బాబు మాటలు గమనిస్తోంటే.. అంతటి అహంకారి – శాసనసభలో- తనను ఇన్నాళ్లూ తిట్టిన సర్ అనడం నచ్చనందువల్లనే సభకు రావడం లేదని అర్థమవుతోంది.
జగన్‌లోని ఫోబియాను బయటపెట్టిన వైసీపీ నేత!
Wednesday, March 19, 2025
