తిరుపతి ‘డిప్యూటీ’ చేజారుతుందని వణుకుతున్న వైసిపి!

Sunday, February 16, 2025


రాష్ట్రంలో రకరకాల కారణాల వలన ఖాళీ అయిన మూడు నగర కార్పొరేషన్లు, ఏడు మునిసిపాలిటీలలో డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం ఎన్నికలు జరిగేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో చాలా ఎన్నికలు పూర్తయ్యాయి. అధికార ఎన్డీఏ కూటమి పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. ప్రధానంగా తెలుగుదేశం వారే ఈ ఉప ఎన్నికలలో విజయం సాధించారు. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం లో చైర్మన్ స్థానాన్ని తెలుగుదేశం దక్కించుకుంది.

సహజంగానే ఇలాంటి ఎన్నికలు జరిగినప్పుడు మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లో ఉండే స్థానిక ప్రతినిధులు అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరించడం రివాజు. ఎలాంటి ఆశ్చర్యకర పరిణామాలు లేకుండా అధికార కూటమి విజయం సాధించింది. అయితే కొన్నిచోట్ల ఉపఎన్నిక వాయిదా పడింది.  తిరుపతి నగర డిప్యూటీ మేయర్ స్థానానికి.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు.. పిడుగురాళ్ల మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు కోరం లేకపోవడం వలన అవి వాయిదా పడ్డాయి.
అయితే ప్రత్యేకించి తిరుపతి డిప్యూటీ మేయర్ స్థానం ఉపఎన్నిక రచ్చరచ్చగా మారుతోంది. తమ పార్టీ చేతిలో నిన్నటి వరకు ఉండినటువంటి ఈ హోదా ప్రస్తుతం చేజారుతుందని వైసిపి వర్గాలు వణుకుతున్నాయి. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి మొన్నటి వరకు నగర డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. మేయర్ ను కూడా బైపాస్ చేస్తూ ఎమ్మెల్యే కొడుకుగా ఉండే తన ప్రత్యేకతను వాడుకుంటూ ఆయన మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రకరకాల అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపణలు కూడా ఉన్నాయి.  గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అభినయ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అందుకోసం ఆయన తన మునిసిపల్ కార్పొరేటర్ స్థానానికి, డిప్యూటీ మేయర్ హోదాకు కూడా రాజీనామా చేశారు. ఆ ఖాళీకి సోమవారం ఎన్నిక జరగాల్సి ఉంది.

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత.. పులివెందుల, పుంగనూరు  సహా అనేక ప్రాంతాల్లో జరిగినట్లుగానే మునిసిపాలిటీల్లోని కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అధికార కూటమి పార్టీలలో చేరడం జరుగుతూ వచ్చింది. తిరుపతిలో కూడా అలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. పలువురు సభ్యులు అధికార కూటమి వైపు చేరారు. డిప్యూటీ మేయర్ హోదా తమ పార్టీ చేజారుతుందని వైసీపీ భయపడుతోంది.
ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా తమ తమ కార్పొరేటర్లతో శిబిరాలు ఏర్పాటు చేశాయి. కూటమి పక్షాన చేరి వారి శిబిరంలో తలదాచుకున్న కార్పొరేటర్ లను అభినయ్ రెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లి దౌర్జన్యంగా తీసుకొని వెళ్లారనేది ఆరోపణ.  వీరిని భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లోనే ఉంచి ఉపఎన్నిక జరిగే సమయానికి బస్సులో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే తమ పార్టీలోకి వచ్చిన వారిని మళ్లీ తీసుకువెళ్లడం పట్ల ఆగ్రహించిన కూటమినేతలు.. ఆ బస్సును అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు వారి వెంట వెళ్లిపోవడం వైసిపి వర్గాలకు మరింత ఆందోళన కలిగించింది. ఈ మధ్యలో కోరం లేకపోవడం వలన డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. మొత్తానికి అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షాలకు చెందిన వారు నామినేషన్లే వేయనివ్వకుండా దౌర్జన్యాలు చేసి ఎలాగైతేనేం మునిసిపాలిటీలను వైసిపి వారు గుప్పిట్లో పెట్టుకున్నారో ఆ కోటలకు ఇప్పుడు బీటలు పడుతున్నాయి. అధికారం లేదు కనుక కార్పొరేటర్లు తమను వీడి వెళ్లిపోతుండడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ స్థానం కూడా చేజారుతుందని ఆ పార్టీ వణుకుతున్నట్లుగా కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles