ఎన్డీయే కూటమి పాలనను నిత్యం విమర్శిస్తూ ఉండకపోతే.. తమ పార్టీకి మనుగడ ఉండదని వైసీపీ నాయకులకు భయం. ఏదో ఒకటి చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను ఆడిపోసుకుంటూనే ఉండాలని అనుకుంటారు. అయితే ఏం విమర్శించాలి? కూటమి ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంది. వారి మీద ఏ నింద వేసినా.. అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజల ఎదుట వారి పనితీరు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. వారే కొన్ని ఊహలను అల్లుకుని.. ఆ ఊహల ఆధారంగా విమర్శలను కూడా తయారుచేసుకుంటున్నారు. తాము చెబుతున్నవి అబద్ధాలేనని వారికే తెలిసినప్పటికీ.. అబద్దాలతోనైనా ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాల్సిందేనని ఆరాటపడుతున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూపర్ సిక్స్ హామీలు అనే పదం తప్ప మరొకటి గుర్తుండదు. ‘సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారూ.. ఏమైపోయాయో తెలియదు..’ అని సర్కాస్టిగ్గా మాట్లాడుతుంటారు. కానీ.. నిజానికి సూపర్ సిక్స్ పై విమర్శలకు కాలం చెల్లింది. ఎందుకంటే చంద్రబాబునాయుడు వాటికి నిర్దిష్టమైన కార్యరూపం ఇచ్చేస్తున్నారు. రోడ్ మ్యాప్ ప్రకటించేశారు. దీపం పథకం ఆల్రెడీ ప్రారంభించిన బాబు.. మహిళలకు ఉచిత బస్పు ప్రయాణం ను ఉగాది నుంచి అమల్లోకి తేనున్నారు. తల్లికి వందనం పథకం కూడా మే నెల నుంచి అమలు కానుంది. రైతులకు అందించే సాయం కేంద్రం వాటా తేలగానే ప్రారంభిస్తాం అంటున్నారు. మరోవైపు ఫీజు రీఇంబర్స్ మెంట్ బకాయిలు లేకుండా చెల్లిస్తున్నారు. వీరి చెల్లింపుల వల్ల.. వైసీపీ హయాంలో ఎగ్గొట్టిన బకాయిలపై ప్రజలు గుస్సా అవుతున్నారు. ఇన్ని సమస్యలతో ఉన్న వైసీపీ నాయకులు.. ఊహల ఆధారంగా కొత్త విమర్శలు తయారుచేసుకుంటున్నారు.
వైఎస్ జగన్ రైతులకు 9 గంటల విద్యుత్తు సరఫరా ఇస్తే.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం దానిని 7 గంటలకు కుదించాలని చూస్తున్నదట. ఇది కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేస్తున్న తాజా ఆరోపణ. ఇంతకూ విద్యుత్తు సరఫరా ఏడు గంటలకు కుదించబోతున్నట్టుగా ప్రభుత్వంలోని పెద్దలు ఎవరు, ఎప్పుడు ప్రకటించారో ఎవ్వరికీ తెలియదు. వైఎస్ అవినాష్ రెడ్డి కలలో దేవుడు కనిపించి చెప్పాడేమో అని జనం నవ్వుకుంటున్నారు. ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన కూడా లేని అంశాన్ని పట్టుకుని.. ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తున్నదని అవినాష్ రెడ్డి అంటున్నారు. ఇంతకంటె కామెడీ ఏంటంటే.. ప్రభుత్వం అలా చేస్తే రైతుల తరఫున పోరాడడానికి వైసీపీ రోడ్డెక్కుతుందట. ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకుపేరు సోమలింగం అన్నట్టుగా ఉంది అవినాష్ వైఖరి. అసలు ప్రభుత్వ నిర్ణయమే లేదు.. కరెంటు వ్యవధి కుదింపులేదు.. రైతుల్లో అసంతృప్తి లేదు.. అప్పుడే అవినాష్ రెడ్డి మాత్రం ఆందోళనలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రణాళిక లేని మాటలు , చేతల వల్లనే వైసీపీ భ్రష్టు పట్టిపోతున్నదని పలువురు అనుకుంటున్నారు.
విమర్శించడం కోసం ఊహలు అల్లుతున్న వైసీపీ!
Wednesday, March 19, 2025
