ఒకప్పటి సినీ రచయిత.. రాజకీయంగా తన భాగ్యాన్ని పరీక్షించుకోదలచి రకరకాల పార్టీల్లోకి గెంతులు గెంతి.. చివరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ భజన చేసుకుంటూ.. ఆయన ఇచ్చిన పదవితో తన జీవితం ధన్యమైందని అనుకున్న పోసాని కృష్ణముురళి ఇప్పుడు వేర్వేరు జైళ్లకు తిరుగుకుంటూ ఉన్నారు. ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అవుతున్నాయి. గతంలో జగన్ పరిపాలన సాగుతున్న రోజుల్లో ఇష్టారాజ్యంగా రెచ్చిపోయి.. నానా బూతులు మాట్లాడినందుకు ఇప్పుడు ఆయన పశ్చాత్తాపపడుతున్నారో లేదో తెలియదుగానీ, ప్రస్తుతానికి రిమాండులో ఉన్నారు. అయితే.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే.. ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా.. రాజకీయాల గురించి జీవితంలో మాట్లాడను అంటూ.. బూటకపు వైరాగ్యం ప్రదర్శించిన పోసాని కృష్ణమురళికి ఫలితం మాత్రం దక్కలేదు. చేయకూడని పాపాలు చేసేసి.. రోజులు వికటించిన తర్వాత.. చేతులు కడిగేసుకున్నంత మాత్రాన ఆ పాపాలు పరిహారం కాబోవని ఆయన దృష్టాంతం అందరికీ నిరూపిస్తోంది.
పోసాని కృష్ణ మురళి అరవయ్యేళ్ల వృద్ధుడని, గతంలో గుండె ఆపరేషన్ జరిగి స్టంట్లు వేయబడిన రోగి అని ఆయన మీద సానుభూతి పుట్టించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నానా పాట్లు పడుతున్నారు. పైగా రాజకీయ సన్యాసం తీసుకున్న, ఇకమీదట జీవితంలో రాజకీయాలు మాట్లాడబోను అని ప్రకటించిన పోసానిని వేధించడం తగదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్న మాత్రం ఒక్కటే. చేతులు కడుక్కుంటే చేసిన పాపాలు పోతాయా? చేసిన పాపాలకు మూల్యం కూడా చెల్లించేసిన తర్వాత.. అప్పుడిక రాజకీయ సన్యాసం, పాతివ్రత్య డైలాగులు మాట్లాడితే నప్పుతుంది గానీ.. రాష్ట్రంలో ప్రజల తీర్పు చెంపదెబ్బలా తగిలిన తర్వాత.. చేసిన పాపాలను కప్పెట్టుకోవడానికి సన్యాసం అనే పదాన్ని ఒక అస్త్రంగా ప్రయోగిస్తే ఎవరు క్షమిస్తారు అని మాత్రమే అంతా అంటున్నారు.
పోసాని కృష్ణ మురళి, అప్పట్లో జగన్ అండ చూసుకుని చెలరేగిన రోజుల్లో తనకు ఇలాంటి పర్యవసానాలు ఉంటాయని ఊహించి ఉండరు. జగనన్న ఏదో తనకు మంచి పదవి కట్టబెట్టారు. పొందగలిగిన లబ్ధి నెరవేరింది. అందుకు కృతజ్ఞతలు చెల్లించుకోవాలి అని ఆయన అనుకున్నారు. తన శత్రువులను పదిమందితోనూ తిట్టించడం కంటె.. జగన్ కు ఆనందకరమైన అంశం మరొకటి ఉండదు గనుక.. ఆ పనిని చెలరేగిపోయి చేశారు. నటుడు గనుక.. హావభావ విన్యాసాలతో తన మార్కు తిట్లతో ప్రవర్తనతో జనం ఏవగించుకుంటున్నా సరే.. జగన్ ను రంజింపజేశారు. అందుకు ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారు తప్ప.. ఈ స్థితి గురించి విలపిస్తే ఎలా అనే అభిప్రాయాలే సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
చేతులు కడుక్కుంటే చేసిన పాపాలు పోతాయా?
Friday, March 28, 2025
