ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ముందుగా ప్రజల తీర్పును గౌరవించాలి. ఏదో మతలబు జరిగిందని కొన్నాళ్లు ఆరోపణలతో కాలం గడిపినప్పటికీ నెమ్మదిగా అయినా.. వాస్తవాలను గ్రహించే చైతన్యం తెచ్చుకోవాలి. కానీ.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో ఈ రెండు లక్షణాలు మాత్రం లేవు. చివరకు గత ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రస్తుతం అక్కడి పార్టీ ఇన్చార్జి వాసుపల్లి గణేశ్ కు ఉన్నంత అవగాహన, చైతన్యం కూడా జగన్ లో లేవు. రాలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసిన నాయకులు, వారి ప్రవర్తన తీరు గురించి వాసుపల్లి గణేష్ కుండబద్ధలు కొట్టినట్టుగా చెబుతున్నారు. అలాంటి నాయకులు పార్టీనుంచి వెళ్లిపోతే తప్ప.. వైసీపీ బాగుపడదని కూడా అంటున్నారు. మరి ఈ చైతన్యాన్ని జగన్మోహన్ రెడ్డి జీర్ణం చేసుకోగలరా? తాను అడ్డంగా వెనకేసుకు వస్తున్న నాయకుల్ని గురించి అలా మాట్లాడినందుకు వాసుపల్లి గణేష్ నే బయటకు పంపించే ప్రయత్నం చేస్తారా? అనేది ఇప్పుడు వైసీపీవర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది.
గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గెలిచి.. ఆతర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్న కొంతమంది ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ కూడా ఉన్నారు. ఆయనకు జగన్ టికెట్ ఇచ్చారు గానీ గెలవలేదు. తాజాగా ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పార్టీ నాయకులతీరును తీవ్రంగా తప్పుపట్టారు. కొడాలినాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా లాంటి వాళ్లు తమ పార్టీని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. వల్లభనేని వంశీ, విజయసాయిరెడ్డి అసలు లీడర్లే కాదని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి కూడా ఇప్పుడు పార్టీలో లేరుగానీ.. ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఆయన ఆ పార్టీకి పెద్ద మైనస్ గా తయారయ్యారంటూ వాసుపల్లి విమర్శించడం గమనార్హం.
వీటన్నింటినీ మించి.. జగన్మోహన్ రెడ్డి ఎంతో మనసుపడి తన ఎగ్జిక్యూటివ్ రాజధానిలో తన నివాసం కోసం, తన కూతుళ్లు ఇద్దరి నివాసాల కోసం రుషికొండకు బోడి కొట్టించి.. టూరిజం శాఖ ఖర్చుతో 500 కోట్లరూపాయలు తగలేసి నిర్మించుకున్న భవనాలను కూడా వాసుపల్లి గణేశ్ విమర్శించారు. అసలు ఆ భవనాల అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. నోటిదూకుడు నాయకులే పార్టీని ముంచేశారని, వారివల్లే ఓడిపోయాం అని గణేష్ అంటున్నారు గానీ.. ఆయనకు వచ్చిన చైతన్యం జగన్మోహన్ రెడ్డికి కనీసం రాబోయే అయిదేళ్లలోనైనా వస్తుందా అనేది అనుమానమే. బూతులకు పేరుమోసిన అసభ్య నాయకులు వల్లభనేని వంశీ, కొడాలి నానిలను జగన్ ఇంకా నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారు. వంశీకోసం జైలుకు వెళ్లినప్పుడు గానీ, మిర్చియార్డుకు వెళ్లినప్పుడు గానీ.. జగన్ వెంట కొడాలి నానిదే మొత్తం హవా! అలాంటి నాయకుల్ని జగన్ దూరం పెట్టడం జరిగే పనేనా? వాసుపల్లి గణేష్ హితోక్తులు జగన్ చెవికెక్కుతాయా? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
వాసుపల్లి చైతన్యం జగన్ లో ఎన్నికైనా వచ్చేనా?
Thursday, March 20, 2025
