రాజకీయాలలో సవాళ్లు విసిరే నాయకులే తప్ప వాటిని నిలబెట్టుకునే మొనగాడు మనకు ఎవడూ కనిపించడు. మహా అయితే చర్చకు ఫలానా సెంటర్ కు వస్తా అని సవాల్ విసిరే నాయకులు వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప, ఇతరత్రా సవాళ్లకు రాజకీయాల్లో మన్నన ఉండదు! ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ప్రతి నాయకుడూ ఏదో ఒక సవాలు విసురుతుంటాడు, శపధం చేస్తుంటాడు. ఎన్నికల తర్వాత వాటిని సునాయాసంగా మరిచిపోతుంటారు కూడా!
కానీ ముద్రగడ పద్మనాభం మాత్రం తన శపథం నిలబెట్టుకున్నారు. ఓటమి దక్కగానే సైలెంట్ అయిపోయి, శపథాన్ని మరిచిపోకుండా, తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నారు. దాని వల్ల తనను తిడుతూ మెసేజులు వస్తున్నాయని కూడా ఆవేదన చెందుతున్నారు, అది వేరే సంగతి.
అయితే తాజా చర్చనీయాంశం ఏమిటంటే ఓడిపోయిన తర్వాత తాను చేసిన శపధాన్ని ఆచరించి నిలబెట్టుకుని చూపించిన ముద్రగడ పద్మనాభం ను చూసి, ఇలాంటి శపథాలుచేసిన ఇతర వైసీపీ నాయకులు సిగ్గుపడరా? రోషం తెచ్చుకోరా? అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచార సమయంలో చాలామంది ప్రగల్భాలు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత కుక్కిన పేనుల్లా కిక్కురుమనకుండా ఉన్నారు. ఇలాంటి వారి గురించి ప్రజలు వెటకారం చేస్తున్నారు.
ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అనుచర గణంలో బూతులు మాట్లాడడంలో సిద్ధహస్తుడు అయిన కొడాలి నాని పేరు చర్చకు వస్తోంది. ఎన్నికలకు ముందు ఆయన కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే కనుక తాను ఆయన బూట్లు తుడుస్తానని, ఆయన పాదాల వద్ద కూర్చుంటానని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు ఆ శపధం ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు. అలాగే చంద్రబాబు బూట్లు కొడాలి నాని తుడుస్తున్నట్లుగా ఫ్లెక్సీలు తయారు చేసి, గుడివాడ నియోజకవర్గం లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు కూడా!
కొడాలి నాని స్థాయిలో కాకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి మునగడానికి సగం కారణం అయిన నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేసిన ప్రతిజ్ఞ కూడా ఒకటి. నరసరావుపేట ఎంపీగా తాను విజయం సాధించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన ప్రకటించారు. అలాగే గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాసు మహేష్ రెడ్డి కూడా ప్రకటించారు. వీరిద్దరి సన్యాసాలు ఎప్పుడు అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాజకీయాలలో ప్రగల్భాలతో కూడిన శపథాలు చేయడం కాదు, మాటకు కట్టుబడి ఉండడం ఎలాగో వారి పార్టీకే చెందిన ముద్రగడ పద్మనాభం నుంచి నేర్చుకోవాలని ప్రజలు అంటున్నారు.
ముద్రగడను చూసైనా వీరికి రోషం వస్తుందా?
Friday, September 20, 2024