2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం (విక్షిత్ భారత్) లక్ష్య సాధనలో భాగంగా తన బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంతకు ముందు పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో సహితం ఈ లక్ష్య సాధననే ప్రముఖంగా ప్రస్తావించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సహితం బడ్జెట్ లక్ష్యం ఇదే అని చెబుతున్నారు.
మొదటిసారిగా గత ఏడాది ఫిబ్రవరిలో దేశం ముందు ఈ లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఉంచారు. సుమారు 2,500 మంది నిపుణులతో చర్చించి ఓ ప్రణాలికను రూపొందించామని కూడా చెప్పారు. అయితే ఆ నిపుణులు ఎవ్వరూ ఇప్పటికీ తెలియదు. కేంద్ర మంత్రివర్గ సభ్యులతో, ఎంపీలతో, వివిధ రాజకీయ పార్టీలతో, చివరకు బిజెపి నేతలతో, చివరకు సైద్ధాంతిక మార్గదర్శిగా భావిస్తున్న ఆర్ఎస్ఎస్ పరివారంతో ఈ అంశంపై ఎటువంటి సమాలోచనలు జరిపిన దాఖలాలు లేవు.
ఆర్ఎస్ఎస్ పరివారంతో ఆర్ధిక అంశాలపై పనిచేస్తున్న బిఎంఎస్, బికెఎస్, స్వదేశీ జాగరణ్ మంచ్ వంటి నాలుగు సంస్థలు ప్రముఖంగా ఉన్నాయి. ఆయా సంస్థలకు చెందిన వారెవ్వరిని కూడా ఈ అంశంపై చర్చించనే లేదు. అసలు `వికసిత్ భారత్’ అంటే అప్పుడప్పుడు ఏవో కొన్ని నినాదాల వంటి మాటలు చెప్పడం మినహా ఓ స్వరూపాన్ని మనముందుంచడం లేదు. ప్రపంచంలో ఆర్ధికంగా మొదటి స్థానంలో ఉండటమేనా అభివృద్ధి? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ బడ్జెట్ లో సహితం ఈ విషయమై స్పష్టత లేదు.
మన తలసరి ఆదాయం $2,697 (ఐఎంఎఫ్: 2024). అయితే అధిక ఆదాయం ఉన్న దేశానికి ఐఎంఎఫ్ బెంచ్‌మార్క్ $23,380. 2047 నాటికి ఆ లక్ష్యాన్ని సాధించడానికి రాబోయే 25 సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 7.6% చొప్పున వృద్ధి చెందాల్సి ఉంటుందని ఆర్బీఐ పరిశోధన చూపిస్తుంది. ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వేలో సహితం 20 ఏళ్లపాటు 8 శాతం జిడిపి సాధించాలని పేర్కొన్నారు. ఆ లక్ష్య సాధనకు మనముందున్న ప్రణాళికలు ఏమిటి?
ఐఎంఎఫ్ డేటా ప్రకారమే 1991 సంస్కరణల నుండి మన ఆర్థిక వ్యవస్థ 7.6% కంటే ఎక్కువ వృద్ధిని వరుసగా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కొనసాగించలేక పోయాము. కేవలం వృద్ధి మాత్రమే పని చేయదు. వృద్ధి ప్రయోజనాలు విస్తృతంగా పంచుకోబడతాయని అసమానతను తగ్గించడంపై మనం దృష్టి పెట్టాలి. అసమానతలు నైతికంగానే కాకుండా మన ఆర్ధిక వ్యవస్థ దారితప్పాడాన్ని కూడా చూచిస్తాయి.
మన జనాభాలో దిగువన ఉన్న సగం మంది భారీ వినియోగ స్థావరం మన వృద్ధికి అతిపెద్ద చోదక శక్తి. వారు ఎక్కువ సంపాదిస్తే, వారు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇది మరింత ఉత్పత్తిని, మరిన్ని ఉద్యోగాలను, అధిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది. మనం వారి జేబుల్లో ఎక్కువ ఆదాయాలను పెట్టలేకపోతే, అది ఒక పెద్ద తప్పిపోయిన అవకాశం అవుతుంది. వికసిత్ భారత్‌కు ముందుకు వెళ్లే మార్గంలో ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే, వృద్ధి రేటును స్థిరంగా ఎలా వేగవంతం చేస్తాము? వృద్ధి ప్రయోజనాలు విస్తృతంగా పంచుకోబడతాయని నిర్ధారించుకుంటాము?
ఆదాయపన్ను పరిమితిని రూ. 12 లక్షలకు పెంచడాన్ని ఘనంగా చెప్పుకుంటున్నారు. అయితే, దీనివల్ల లబ్ధి పొందే ప్రజానీకం దేశవ్యాప్తంగా ఒక్క శాతం కూడా ఉండరని మరచిపోరాడు. పైగా కార్పొరేట్లకు ఇచ్చిన రాయితీలతో పోల్చుకుంటే ఇది సముద్రంలో నీటిబొట్టంత కూడా ఉండకపోవచ్చు. దశాబ్ధకాలంగా దేశంలో నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు, అసమానతలు పెరిగి పోతూ ఉండడంతో పాటు పొదుపు రేట్లు తగ్గిపోతున్నాయి.
మరోవంక, ప్రభుత్వ పెట్టుబడులతో పాటు, ప్రైవేటు పెట్టుబడులు కూడా కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను తెగనమ్ముతున్నా ఆర్థిక వ్యవస్థను గదిలోకి పెట్టలేక పోతున్నాము. ఈ కీలకమైన సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నాలు కనిపించడం లేదు.
బడ్జెట్ కు ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేను గమనిస్తే ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి భద్రతలో చాలా అవసరమైన నిర్మాణాత్మక జోక్యాల కంటే ‘వ్యాపారం చేయడం సులభం’కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేస్తుంది. ప్రజాకంటకంగా మారిన జీఎస్టీలో సంస్కరణల గురించిన ప్రస్తావన లేదు. ఆదాయపన్నులో భారీ రాయితీ ప్రకాయించడం ద్వారా పన్ను ఉగ్రవాదం గురించి ప్రజలను కాపాడతామనికోలేము.
ఎందుకంటె దేశంలో స్థిరమైన ఆదాయం, ఒకవిధంగా నెలవారీ జీతాలు పొందుతున్న వారి సంఖ్య తగ్గిపోతుంది. అంటే ప్రజల కొనుగోలు శక్తీ దారుణంగా పడిపోతుంది. 2017-18లో 6% ఉన్న నిరుద్యోగం 2023-24లో 3.2%కి తగ్గిందని, స్వయం ఉపాధి 52.2% నుండి 58.4%కి పెరిగిందని పేర్కొంటూ సర్వే ఉపాధికి సంబంధించిన ఆశాజనకమైన చిత్రాన్ని సర్వే చిత్రించింది. కానీ ఇది ఆర్థిక పురోగతికి సంకేతం కాదు. ఇది అనిశ్చితికి ప్రతిబింబం. జీతం పొందే ఉద్యోగాల నుండి స్వయం ఉపాధికి మారడం వ్యవస్థాపకతలో పెరుగుదలను సూచించదు. అందుకు బదులుగా స్థిరమైన, మంచి జీతం ఇచ్చే ఉద్యోగాలు లేకపోవడాన్ని సూచిస్తుంది.
కార్మిక చట్టాలను సడలించడం, వ్యాపార నిబంధనలను నేరరహితం చేయడం ద్వారా కార్మికుల హక్కులను కూడా పణంగా పెడుతోంది. వాస్తవానికి, మంచి ఉపాధి అవకాశాలను క్షీణింపజేస్తున్నది. సర్వే బ్యాంకుల మొండి బకాయిలు (ఎన్ పిఎ)లు కనిష్ట స్థాయికి చేరుకున్నాయని ఘనంగా ప్రకటించుకున్న వాస్తవానికి కార్పొరేట్‌లకు భారీగా బకాయిలను రద్దు చేయడంతో సాధించారని మరచిపోలేము. మరోవంక ప్రాధాన్యత రంగాలకు బ్యాంకులు ఇస్తున్న రుణాలు తగ్గిపోతున్నాయి. ఈ అంశంపై బడ్జెట్ మౌనంగానే ఉన్నది.
గృహ ఆదాయ వృద్ధి మందగించింది, గ్రామీణ వేతనాలు స్తబ్దుగా ఉన్నాయి. రైతుల ఆదాయాలు 2022 నాటికి రెట్టింపు చేస్తామని గతంలో ప్రధాని చేసిన ప్రకటనలను ఇప్పుడు ప్రస్తావించడం లేదు. పైగా, పెరుగుతున్న వ్యవసాయ సంక్షోభంన్ని తీవ్రంగా పరిగణిస్తున్న సూచనలే కనిపించడం లేదు. వ్యవస్థీకృత రంగ వేతన వృద్ధి తగ్గుతోంది. ఇది “సమ్మిళిత వృద్ధి” అయితే, చేరిక ఎక్కడ ఉంది? ముఖ్యంగా మహిళలకు దీని ప్రభావం తీవ్రంగా ఉంది. 2017-18, 2023-24 మధ్య రెగ్యులర్ వేతన ఉద్యోగాలలో మహిళల నిష్పత్తి వరుసగా 10.5% నుండి 7.8%కి పడిపోయింది, దీని వలన చాలామంది చెల్లించని లేదా స్వీయ-దోపిడీ శ్రమలోకి నెట్టబడ్డారని స్పష్టం అవుతుంది.
ప్రజల సంక్షేమానికి బడ్జెట్‌లో నిర్దుష్టమైన ప్రతిపాదనలు కనిపించవు. అన్నీ కోతలే. లక్ష కోట్లకు పైగా నిధులు తగ్గించారు. కార్మికుల సంక్షేమానికి, ఉపాధి హామీకి ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదు. వందశాతం విదేశీపెట్టుబడులను అనుమతించడం బీమా రంగంలో విదేశీ గుత్తపెట్టుబడిదారి సంస్థల ఆధిపత్యానికి దారి తీయనుంది. మౌలిక వసతుల కల్పన పేరుతో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేల వంటి కీలక సదుపాయాలను ఎంపిక చేసే కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఐదేళ్లకాలంలో ఈ పిపిపి ప్రాజెక్టుల విలువ 10 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.
అదే సమయంలో కీలకమైన వ్యవసాయ రంగానికి ఎటువంటి ఎటువంటి ఉపశమనమూ దక్కలేదు. రుణ ఉపశమనంతో సహా ఇతర రాయితీలు లేవు. వంద జిల్లాలకు ప్రకటించిన ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజనను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించుకోవాల్సిఉంది. ఎరువులు, ఆహార,సబ్సిడీలు, పంటలబీమాకు కోతపడింది. గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలుకు నిధులు పెంచలేదు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కోరుతూ ఒక వైపు రైతులు ఆందోళన చేస్తుండగా ఒక్క రూపాయి కూడా అందుకు కేటాయించలేదు.
నేడు రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మార్కెటింగ్. ఈ విషయంలో ఎటువంటి భారీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. వ్యవసాయ మార్కెట్ లలో దళారీల దోపిడీల నుండి రైతులను కాపాడే ఆలోచనలు ఈ ప్రభుత్వంకు ఉన్నట్లు దాఖలాలు లేవు. పైగా, ధరలు పెరిగి రైతులకు కొద్దిపాటి ఆదాయం వస్తున్న సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించడం, దిగుమతులను పెంచడం వంటి రైతు వ్యతిరేక విధానాలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. మనం ఎంతో కష్టించి సాధించుకున్న ఆహార భద్రత ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి.
స్వతంత్రం వచ్చినప్పటి నుండి అన్ని ప్రభుత్వాలు చేసిన అప్పులకు మించి మోదీ ప్రభుత్వం కేవలం 8 ఏళ్లలో అంతకన్నా రెట్టింపు అప్పులు చేసింది. ఈ మొత్తాలను ఎక్కువగా ప్రభుత్వ నిర్వహణ కోసం, రాజకీయ ప్రయోజనాలు కలిగించే కేటాయింపుల కోసమే ఖర్చు పెడుతున్నారు గాని కీలకమైన విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు పెంపొందించే రంగాలపై ఖర్చు పెట్టడం లేదు. మరోవంక, కేంద్ర ప్రాయోజిత పధకాలకు కేటాయింపులు పెంచడం ద్వారా రాష్ట్రాల ఆదాయ వనరులపై విపరీతంగా కోతలు విధిస్తున్నారు.
ఉత్పత్తి రంగం పుంజుకుంటే గాని ఉపాధి అవకాశాలు పెరగడం, ప్రజల వినిమయ శక్తీ పెరగడం, ఆర్థికాభివృద్ధి పుంజుకోవడం జరగదు. కానీ గత పదేళ్లుగా ఈ రంగంలో చెప్పుకోదగిన పురోగతి సాధింపలేక పోతున్నాము. పైగా, ఎగుమతులు- దిగుమతులు సహితం ఆర్థికాభివృద్ధికి అనువుగా ఉండటం లేదు. ` వికసిత్ భారత్’ను మరో నినాదంగా పరిమితం చేయకుండా విధానపరమైన రూపం కలిగించాలి.