చంద్రబాబునాయుడు పెట్టిన రాజకీయ భిక్షతోనే ఎమ్మెల్యే అయి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి అయినప్పటికీ.. అనంతర పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి పంచన చేరిన అనేకమంది నాయకుల్లో ముందువరుసలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు- కొడాలి నాని తప్పకుండా ఉంటారు. జగన్ పాలన కాలంలో అధికార అహంకారంతో కళ్లుమూసుకుపోయి.. చంద్రబాబునాయుడు ఆయన ఎన్నెన్ని తిట్లు తిడుతూ వచ్చారో అందరూ గమనించారు. నోరు తెరిస్తే పచ్చిబూతులు మాట్లాడే మంత్రిగా ఆయన రాష్ట్ర ప్రజల దృష్టిలో ముద్రపడ్డారు. ఆయన తిట్టిన తిట్ల రేంజి చూసిన వారికి.. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా కక్ష సాధించడానికి పూనుకుంటే గనుక.. అందరికంటె ముందుగా కొడాలి నాని జైలుకు వెళ్లాల్సి వస్తుందని కూడా అంతా అనుకుని ఉంటారు. కానీ ఆయన ఇప్పటిదాకా హాయిగా బయటే ఉన్నారు. అలాగని కొడాలి నాని గత ప్రభుత్వ కాలంలో ఎలాంటి నేరాలు చేయని సుద్దపూస అనుకోవడానికి వీల్లేదు. ఆయన పాల్పడిన అక్రమాలకు సంబంధించి, విజిలెన్సు విచారణలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. అయితే.. ఆయనపై విచారణలు ఒక కొలిక్కి రానున్నాయని, త్వరలోనే కేసులు నమోదు అవుతాయని అంతా అనుకుంటున్న తరుణంలో ఆయన విదేశాలకు వెళ్లనున్నారనే సమాచారం బయటకు వస్తోంది.
కొడాలి నాని కొన్నాళ్ల కిందట అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాదులో కొన్ని రోజులు చికిత్స చేయించుకుని సర్జరీ కోసం అని చెప్పి ముంబాయి వెళ్లారు. అక్కడినుంచి ఇటీవలే తిరిగి హైదరాబాదు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్టీ నాయకులు కూడా ఎవ్వరినీ కలవడం లేదని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన త్వరలోనే చికిత్స పేరుతో అమెరికాకు వెళ్లాలనుకుంటున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
అమెరికా పారిపోతే సుదీర్ఘకాలం విచారణల బెడద తప్పించుకోవచ్చునని వ్యూహాత్మకంగా కదులుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఏపీ పోలీసులు ముందుగానే మేలుకుని ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీచేయాలని పలువురు తెలుగుదేశం వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే అనేకమంది వైసీపీ నాయకులు పరారీలో ఉన్నారు. కాకాణి గోవర్దనిరెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి అసలు దేశంలో ఉన్నారో లేదో తెలియదు. వల్లభనేని వంశీ అనుచరులు కొందరు నేపాల్ పారిపోయి ఉన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో కొడాలి నాని కూడా అమెరికా పారిపోయే దాకా పోలీసులు కాలయాపన చేయకుండా.. వెంటనే కేసులు కట్టి చర్యలు ప్రారంభించాలని తెలుగుదేశం వారు కోరుకుంటున్నారు.
కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు ఇస్తారా?
Wednesday, July 9, 2025
