జగన్మోహన్ రెడ్డి.. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అడ్డదారుల్లో విచ్చలవిడిగా పాల్పడిన అవనీతికి సంబంధించిన కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. వైఎష్ వివేకానందరెడ్డి
హత్య జరిగి ఆరేళ్లు అవుతోంది. హత్య తర్వాత.. జగన్ అధికారంలోకి వచ్చి దిగిపోయారు కూడా. అయినా సరే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కీలక నిందితుడిగా ఉన్న కేసులు కూడా ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో.. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా తాజాగా కోర్టులో అఫిడవిట్ వేశారు. ప్రజాప్రతినిధుల మీద కేసులు సుదీర్ఘకాలం పెండింగులో ఉండడం అనేది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఆయన వ్యాఖ్యానించారు. హన్సారియా అఫిడవిట్ నేపథ్యంలో.. ప్రజాప్రతినిధుల మీద కేసులను త్వరగా పరిష్కరించాలని.. సుప్రీం కోర్టు ఆదేశించడం అంటూ జరిగితే గనుక.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అవినీతి కేసులు వేగం పుంజుకుంటాయని, త్వరలోనే జగన్ కు శిక్షలు కూడా ఖరారవుతాయని పలువురు అంచనా వేస్తున్నారు.
మాజీ, సిటింగ్ ఎంపీలు/ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు సంబంధించి సుప్రీం కోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.ఈ పిల్ విషయంలో విజయ్ హన్సారియాను సుప్రీంకోర్టుకు ఆమికస్ క్యూరీగా నియమించారు. ఆయన ఇలాంటి నాయకుల కేసులకు సంబంధించి.. ఇప్పటివరకు జారీఅయిన ఉత్తర్వులు, వాటి అమలులో పురోగతి, వివిధ రాష్ట్రాల్లో పత్ర్యేక కోర్టుల్లో పెండింగులో ఉన్న కేసుల వివరాలు అన్నీ కలిపి విజయ్ హన్సారియా ఒక అఫిడవిట్ సమర్పించారు.
నాయకులపై పెండింగ్ కేసులు ప్రజాస్వామ్యానికి మచ్చ అంటూనే, వీటిని త్వరితగతిని విచారణ పూర్తిచేసేలా సుప్రీంకోర్టు ఆదేశాలివ్వాలని హన్సారియా నివేదించారు.
క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నాయకులు.. తిరిగి ఎన్నికల్లో పోటీచేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్వనీ ఉపాధ్యాయ్ 2016లో దాఖలు చేసిన పిల్ పై విచారణ జరగబోతుంది.
కొన్ని కేసులు సంవత్సరాలు, దశాబ్దాలు పాటు విచారణ సాగడం చూస్తుంటే.. ఈ ప్రజాప్రతినిధులే విచారణ మీద దారుణంగా ప్రభావం చూపిస్తన్నట్టు హన్సారియా పేర్కొన్నారు. ఆయా కోర్టులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని కూడా ఆరోపించారు. వాయిదాలకు నిందితులు హాజరు కాకుండా.. విచారణ బాగా జాప్యం జరిగేలాగా వ్యవహరిస్తున్నారు అని ఆయన చెప్పారు.
ఈ కేసుల వివరాలన్నీ వెబ్ సైట్ ల ద్వారా అందరికీ అందుబాటులో ఉంచాలని, వేగంగా విచారణ పూర్తయ్యేలా సుప్రీం కోర్టు ఆదేశాలివ్వాలని ఆయన సూచించారు. జగన్ మీద అవినీతి కేసులు దాదాపు ఒకటిన్నర దశాబ్దంగా సాగుతున్నాయి. హన్సారియా గుర్తించిన లోపాలన్నీ జగన్ కేసుల విచారణలో ప్రజలు గమనిస్తున్నవే. సుప్రీం కన్నెర్ర చేస్తే ఈ ప్రత్యేక కోర్టులు త్వరలో తేలుస్తాయని.. జగన్ కు శిక్షలు తప్పవని పలువురు అనుకుంటున్నారు.
ఈ దెబ్బతో జగన్ కేసులు త్వరగా తేలుతాయా?
Thursday, March 20, 2025
