రాజంపేట, కర్నూలు.. ఇలా రకరకాల జైళ్లు తిరిగి పోసాని కృష్ణమురళి ప్రస్తుతం గుంటూరు జైలుకు వచ్చారు. ఆయన మీద ఎడతెగకుండా కేసులు నమోదు అవుతున్నాయి. ఒకటి పాతబడేలోగా మరొక కేసు నమోదు అవుతోంది. మొత్తానికి జగన్ కళ్లలో ఆనందం చూసేందుకు అప్పటి ప్రతిపక్షాలకు చెందిన నాయకులందరి మీద రెచ్చిపోయిన ఫలితం ఇప్పుడు పోసాని అనుభవిస్తున్నారు. పవన్ కల్యాణ్ కుటుంబాన్ని అసభ్యంగా దూషించిన కేసులకు తోడు, ఇప్పుడు చంద్రబాబునాయుడును దూషించిన కేసులు కూడా జత అవుతున్నాయి. తిరిగి ఆయన ప్రస్తుతానికి గుంటూరు జైలుకు చేరుకున్నారు. సమీపంలోనే ఉన్నారు గనుక.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించడానికి వెళతారా లేదా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో… జనబాహుళ్యంలోకి రావడం అంటే.. కేవలం పరామర్శలకు మాత్రమే అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. నిజం చెప్పాలంటే.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు, తాడేపల్లి ప్యాలెస్ కు మధ్య షటిల్ సర్వీసులాగా తిరుగుతూనే ఉన్నారు. ట్విటర్ లో ప్రభుత్వాన్ని నిందించడం తప్ప ఆయన వాస్తవంగా ప్రజల్లోకి వచ్చి చేసిన పని ఒక్కటీ లేదు. ఇటీవలి కాలంలో మిర్చి రైతుల పరామర్శకు గుంటూరు మిర్చియార్డుకు వెళ్లడం చాలా గొప్ప అచీవ్మెంట్ కింద లెక్క.
అయితే జైలు పాలవుతున్న తమ నాయకులను ములాఖత్ లలో వెళ్లి పరామర్శించడానికి, ఎక్కడైనా తమ పార్టీ వారు చచ్చిపోతే.. అవి రాజకీయ హత్యలే అని రంగు పులుముతూ వెళ్లి యాగీ చేయడానికి మాత్రం జగన్ సమయం కేటాయిస్తున్నారు. ఆదిమూలపు సురేష్, వల్లభనేని వంశీలను చాలా పంక్చువల్ గా ములాఖత్ కు వెళ్లి జైల్లో పరామర్శించిన జగన్.. ఇప్పటిదాకా పోసాని మీద అలాంటి ప్రేమను చూపించలేదు.
ఆయన ఇన్నాళ్లూ రాజంపేట, కర్నూలు జైళ్లలో ఉండడం వల్ల.. జగన్ కు అంతదూరం వెళ్లే ఓపిక లేక వెళ్లలేదేమో.. ఇప్పుడు జగన్ కోసం అందుబాటు దూరంలోకి తీసుకొచ్చి గుంటూరు జైల్లో పెట్టారు.. కనీసం ఇప్పుడైనా ములాఖత్ కు వెళ్లి పరామర్శించేది ఉంటుందా లేదా అని పలువురు అనుకుంటున్నారు. అదే సమయంలో పార్టీలో మరొక వాదన కూడా వినిపిస్తోంది. పోసానికి అంత సీన్ లేదని కొందరి వాదన. ఆదిమూలం, వల్లభనేని లను ములాఖత్ ల కలవడానికి పోసానికి పోలిక లేదని.. వారు పార్టీ నాయకులు కాగా, పోసాని కేవలం ఒక బంటు లాంటి వాడు మాత్రమేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జగన్ కరపత్రిక, చానెల్ మాత్రం.. పోసాని మీద వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్నాయి. పోసాని నటుడు గనుక.. ఆయన మీద సానుభూతి పుట్టించేలా కథనాలు చేస్తే ప్రజల్లో తమ పార్టీకి మైలేజీ ఉంటుందని అనుకున్నారేమో తెలియదు. ఇంతకూ జగన్, పోసాని ఉన్న జైలుకు వెళ్లి కలిస్తేనే ఆయన మీద కూడా నిజంగా కాస్త ప్రేమ ఉన్నట్టు అనుకోవచ్చునని పలువురు భావిస్తున్నారు.
పోసాని పరామర్శకు జగన్ వెళ్తారా? లేదా?
Friday, March 28, 2025
