అధికారంలో ఉన్నాం కదా అని వారు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించారు. భారీస్థాయి నిర్మాణాలు చేపడుతూ అనుమతుల గురించి తమను అడిగేంత ధైర్యం ఎవరికి ఉంటుందన్నట్టుగా చెలరేగిపోయారు. కేవలం నిర్మాణ అనుమతులు మాత్రమే కాదు.. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్న అనుమతుల గురించి కూడా పట్టించుకోకుండా.. అన్ని రకాల ఉల్లంఘనలతో పనులు చేసుకుంటూ పోయారు. తీరా ఏమైంది? రాష్ట్రంలో అధికారం మారింది. తమ విచ్చలవిడిపోకడలతో చెలరేగుతూ ముందుకు సాగే అవకాశం లేకుండాపోయింది. ఈలోగా అనుమతులు ఇవ్వాల్సిన సంస్థలన్నీ కన్నెర్రజేస్తున్నాయి. మొత్తానికి వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణ గుంటూరులో భారీస్థాయిలో నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణాల పరిస్థితి డోలాయమానంగా మారింది. పూర్తిగా న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న ఈ నిర్మాణాలకు, తాజాగా కేంద్ర పర్యావరణ సంస్థ కూడా అనుమతులు లేవంటూ షాక్ ఇచ్చింది. ఈ నిర్మాణాలకు త్వరలో పెద్ద దెబ్బే పడుతుందని పలువురు అంచనా వేస్తు్నారు.
వైసీపీ జమానా సాగిన రోజుల్లో ఆ పార్టీ ముద్ర ఉన్న ప్రతి నాయకుడూ చట్టాన్ని, నిబంధనల్ని ఎక్కడా ఏమాత్రమూ పట్టించుకోకుండా చెలరేగిపోయిన సంగతి ప్రజలందరికీ తెలుసు. మామూలు వాళ్లు కూడా పెద్ద పెద్ద దందాలు చేస్తూ వచ్చారు. అలాంటిది వైసీపీలో కీలక నేత అయిన అంబటి రాంబాబు సోదరుడు చిన్న తప్పు ఎందుకు చేస్తారు? 2024 ఎన్నికల్లో జగన్ ను మెప్పించి.. ఆయన పెట్టుకున్న బూటకపు రూలు ‘ఒక కుటుంబంలో ఒక తరంలో ఒక్కరికి మాత్రమే టికెట్’ అనే నిబంధనను కూడా తోసిరాజని.. తనకు టికెట్ దక్కించుకున్న అంబటి మురళి కూడా ఘనమైన దందాలే చేశారు.
గుంటూరులో గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ పేరుతో భారీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణాలు పూర్తిగా ఎలాంటి అనుతులు లేకుండా, చట్టబద్ధమైన నో అబ్జెక్షన్ లు లేకుండా.. సాగించడం విశేషం. వ్యవహారం కోర్టుకు వెళ్లింది. అటు పీసీబీ వాళ్లు, రైల్వే వాళ్లు అందరూ కాదంటున్న నిర్మాణాలు మాత్రం సాగించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. ఆ ఉత్తర్వులకు వ్యతిరేకం అయినప్పటికీ.. ఇటీవల ఒక ఫ్లాట్ లో గృహప్రవేశం కూడా చేయించారు. తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ.. ఈ నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులను నిలిపేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గుంటూరు కార్పొరేషన్ ఉత్తర్వులను కూడా ధిక్కరించి నిర్మాణాలు సాగించిన వైనం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.
అంబటి మురళికి చెందిన ఈ నిర్మాణాల విషయంలో ఆయనకు పెద్ద ఎదురుదెబ్బే తగులుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి సాగించే నిర్మాణాలను కూల్చివేస్తే తప్ప.. ఇలాంటి అరాచకాలు సాగించే వారికి ఆలోచన మారదని ప్రజలు అంటున్నారు.
అంబటి అరాచకత్వానికి పెద్ద దెబ్బే పడుతుందా?
Friday, March 28, 2025
