తన మీద చేసిన ఆరోపణలు దమ్ముంటే నిరూపించాలని మంత్రి నారా లోకేష్.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అలా నిరూపించ లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేయలేదు. జస్ట్ తప్పుడు ఆరోపణలు చేసినందుకు యువతకు క్షమాపణ చెబితే సరిపోతుంది అని మాత్రమే అన్నారు. ఇది చాలా రీజనబుల్ గా ఉంది. తప్పుడు ఆరోపణలు చేసి తప్పించుకు వెళ్ళిపోతే కుదరదు అని సంకేతాలు ఇస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరితే.. ఆయన స్పందించడం మానేసి, మధ్యలో ఎగస్ట్రా ఆర్టిస్టులు చొరబడి మాటలు రువ్వుతున్నారు. వీరి ఓవరాక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు తీసేలా ఉన్నదే తప్ప.. మరొకటి కాదని ప్రజలు భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఉర్సా కంపెనీకి విశాఖపట్నం ఐటి హిల్స్ లో కోట్ల విలువైన భూమిని ఎకరం ఒక్క రూపాయివంతున కట్టబెట్టి కోట్లకు కోట్ల రూపాయలు దోచిపెట్టినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు నెలలుగా విషం చిమ్ముతున్నది. ఈ విషయం మీదనే ఒక్క ఆరోపణనైనా నిరూపించాలని నారా లోకేష్ సవాలు విసిరారు. మూడు ఎకరాలను ఒక్కొక్కటి కోటి రూపాయల వంతున, 56 ఎకరాలను ఒక్కొక్కటి 50 లక్షల వంతున కేటాయించాం తప్ప రూపాయికి ఇవ్వడం అనేది అసత్యం అని ఆయన చెబుతున్నారు.
ధైర్యంగా ఈ సవాలును స్వీకరించవలసిన జగన్ మౌనం పాటిస్తుండగా.. ఆయన తరఫున రంగ ప్రవేశం చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. అసలు విషయం వదిలేసి సోది మాట్లాడుతున్నారు. ఎకరం రూపాయికి కట్టబెట్టినట్టుగా చేసిన ఆరోపణ ప్రస్తావన కూడా ఆయన వివరణలో లేకపోవడం తమాషా. ఆ కంపెనీ ఎప్పుడు ప్రారంభమైంది ఎక్కడ ఆఫీస్ ఉంది ఇలాంటి వివరాలు ప్రస్తావిస్తూ.. పసలేని కొత్త ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ప్రభుత్వం తప్పు చేసిందని వారు అన్నదల్లా ఎకరం కోటి రూపాయలకు ఇచ్చారనేది మాత్రమే. నారా లోకేష్ స్వయంగా సవాల్ విసిరేసరికి ఆ పాయింట్ మరిచిపోతున్నారు. ఇది తప్ప ఏదేదో సంగతులు మాట్లాడుతూ తప్పు జరిగిందని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నంలో ఉన్నారు. చేసిన అసలు ఆరోపణను వదిలేసి డొంకతిరుగుడు మాటలు వెతుక్కుంటూ ఉండడంలోనే వారు చేసినవి తప్పుడు ఆరోపణలు అనే సంగతి తేటతెల్లడం అవుతున్నదని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు అమాయకులు కదా అని అబద్ధాలతో చెలరేగితే, పోయేది జగన్మోహన్ రెడ్డి పరువే అని కూడా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
అసలు సవాలు వదిలేసి చిల్లర మాటలు ఎందుకు సార్?
Thursday, June 19, 2025
