మొత్తానికి కలుగులోంచి ఒకరు బయటకు వచ్చారు. రకరకాల కేసుల్లో నిందితులుగా ఉంటూ పరారీలో తలదాచుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నాయకుల్లో ఒకరైన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.. ఎట్టకేలకు రామగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లిలో పర్యటించినప్పుడు.. హెలిప్యాడ్ వద్ద పోలీసుల మీద దాడికి పురిగొల్పినట్టుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద కేసు ఉంది. ఈ కేసు నమోదు అయిన తర్వాత.. ఆయన పరారీలోకి వెళ్లిపోయారు. పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్లినప్పుడు అసలు దొరకలేదు. ఇన్నాళ్లుగా పరారీలో దాక్కున్న ఆయన ఎట్టకేలకు విచారణకు వచ్చారు.
హెలికాప్టర్ ను ఎవరు సమకూర్చారు? హెలిప్యాడ్ వద్ద బారికేడ్లు పటిష్టంగా లేవని పోలీసులు హెచ్చరించినా ఎందుకు మార్చలేదు? అక్కడకు జనసమీకరణ వద్దని పోలీసులు వారించినా.. ఎందుకు వినకుండా వేలమందిని అక్కడికే తరలించారు? వంటి ప్రశ్నలు పోలీసులు సంధించారు. అయితే తోపుదుర్తి మాత్రం.. వారంతా ఎలా అక్కడకు వచ్చారో తనకు తెలియదని అంటూ.. హెలికాప్టర్ వద్దకు వెళ్లొద్దని మైకులో చెబుతూ వారిని వారించడానికి తాను ప్రయత్నించానని బుకాయించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అసలు హెలికాప్టర్ కు సంబంధించిన ఏర్పాట్లు తాను చూడలేదని అన్నట్టు సమాచారం. మొత్తానికి అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని పోలీసులు చెప్పిన పిమ్మట ఆయన వెళ్లిపోయారు.
అయితే.. పోలీసు విచారణ తర్వాత.. బయట మీడియాతో మాట్లాడుతూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. లింగమయ్య హత్య కేసును పక్కదారి పట్టించడానికి హెలిప్యాడ్ ఘటన మీద అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆయన ఎగిరెగిరి పడుతున్నారు. తోపులాట బారికేడ్ల వల్లనే జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారని, నిజానికి ఇది పోలీసుల వైఫల్యం అని రెచ్చిపోతున్నారు. మరి పోలీసుల మీదికి రాళ్లు రువ్వి గాయపరిచేలా కార్యకర్తల్ని రెచ్చగొట్టిన పాపం తనదేనని ఆయన చెప్పుకోకపోవచ్చు గానీ.. ఆయన మాటలే తమాషాగా ఉన్నాయి.
హెలిప్యాడ్ వద్ద ఘటనను రాద్ధాంతం చేసిందెవరు? జగన్ రోడ్డు మార్గంలో వెళ్లే పరిస్థితిని సృష్టించి ఆయనను అంతమొందించడానికి అధికార కూటమి నాయకులు ప్రయత్నించారని, అందుకు వీలుగా.. హెలికాప్టర్ దెబ్బతినేలా చేశారని ఆరోపించింది ఎవరు? ఏకంగా జగన్ హత్యకోసం స్కెచ్ వేశారని ఆరోపించింది ఎవరు? జగన్ కారెక్కి వెళ్లినందుకే కుమిలిపోయిన వైసీపీ నాయకులందరూ ఒక్కపెట్టున గుంపులు గుంపులుగా మీడియా ముందుకు వచ్చి.. జగన్ ను చంపేస్తున్నారో అని గగ్గోలు పెట్టారు. తీరా అసలు హెలికాప్టర్ కు ఏం జరిగింది? ఎలా జరిగింది? అని విచారణ ప్రారంభించగానే.. ఆరోజు గోలచేసిన వారిలో ఒకరైన, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. హెలిప్యాడ్ ఘటనను రాద్ధాంతం చేయడం ఆయనను, వైసీపీ వ్యూహాలను అభాసు పాల్జేసేలా ఉంది.
హెలిప్యాడ్ రాద్ధాంతం’ చేసిందెవరు తోపుదుర్తీ!?
Thursday, June 19, 2025
