వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు గురించి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక ధర్మ సందేహం లేవనెత్తారు. ‘మగాడికి మగాడి అందం నచ్చడం’ అంటే దానిని ఎలా అర్థం చేసుకోవాలో.. అంటూ ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నిందించడంకోసం జగన్ ఒక రకం మాటలు సంధిస్తే.. అవే మాటలను జగన్ బుద్ధిని బయటపెట్టడానికి ఉపయోగిస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేయడం గమనార్హం.
రెండు రోజుల కిందట వైఎస్ జగన్.. ప్రస్తుతం రిమాండులో ఉన్న ఖైదీ వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత.. వంశీని ఎంత అక్రమంగా, అరాచకంగా అరెస్టు చేశారో ఆడిపోసుకుంటూ చంద్రబాబు మీద నిప్పులు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాటలు చిత్రంగా సాగిపోయాయి.
వంశీని పరామర్శించడం లేదా, వంశీ చేసిన దళితుడి కిడ్నాపు, నిర్బంధం వంటి వ్యవహారాలను దాచిపెట్టి ఆయనను సమర్థించడం వలన తనకు కమ్మ సామాజిక వర్గంలో ఆదరణ దక్కుతుందని జగన్ భ్రమించారేమో తెలియదు గానీ.. వంశీ పరామర్శ తర్వాత కులం ప్రస్తావన తేవడం చిత్రంగా అనిపించింది. తన సొంత సామాజికవర్గంలో మరొక నాయకుడు ఎదుగుతుండడం చూసి ఓర్వలేకనే.. చంద్రబాబునాయుడు వంశీని అరెస్టు చేయించాడని జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మాటలు ఎంత లాజిక్ లేనివో ఆయనకు అర్థమైనట్టు లేదు.
వంశీని ఎమ్మెల్యే చేసి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబునాయుడు.. వైసీపీలోకి జంప్ చేసినంత మాత్రాన వంశీ కొత్తగా ఏం ఎదిగాడు? ఎమ్మెల్యేగానే కదా ఉన్నాడు. మరి ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఈ రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్న చంద్రబాబునాయుడు.. వంశీని చూసి అసూయపడాల్సిన ఖర్మ ఉందా అనేది ప్రజల సందేహం. జగన్ అక్కడితో ఆగలేదు.
వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరూ చాలా అందగాళ్లుట! వారిద్దరూ తనకంటె అందంగా ఉంటారని, వారిని చూసి చంద్రబాబునాయుడు ఓర్వలేకపోతున్నారట…! ఈ వెకిలి మాటలు కూడా జగన్ మాట్లాడడం చూసి జనం నవ్వుకున్నారు. సోమిరెడ్డి అవే వ్యాఖ్యలను హేళన చేస్తున్నారు. ‘అసలు మగాడికి, మరో మగాడి అందం నచ్చడం ఏమిటో.. వారిద్దరి అందాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎందుకు చూశాడో..’ అంటూ సోమిరెడ్డి హేళన చేయడం విశేషం.
ప్రెస్ మీట్ లో మాట్లాడాలన్నా సరే.. పక్కాగా ఒక స్క్రిప్టు రాయించుకుని.. అందులో ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని రెండు మూడుసార్లు చూసుకుని చదవడం మాత్రమే చేసే నాయకుడు జగన్. స్క్రిప్టు చదివేశాక.. మీడియా వారి ప్రశ్నలకు జవాబులివ్వకుండా పారిపోయే వ్యక్తి జగన్. అలాంటి జగన్ అసలు స్క్రిప్టు లేకుండా మాట్లాడాల్సి వస్తే.. ఆ మాటలు ఎంతగా దారితప్పిపోతాయో.. అందం చందం అంటూ ఎలా వెకిలిగా మారుతాయో, ఆయన పరువు తీస్తాయో ఇదే ఉదాహరణ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
‘మగాడికి మగాడి అందం నచ్చడం అంటే ఏంటో?’
Friday, March 28, 2025
