రాంగోపాల్ వర్మకు జగన్మోహన్ రెడ్డి పట్ల అవ్యాజమైన ప్రేమాభిమానాలు ఉంటాయా? జగన్ మీద అభిమానంతోనే ఆయనకు అనుకూలంగా సినిమాలు తీసి ఇప్పుడు పోలీసులు కేసులు ఎదుర్కొనే స్థితికివచ్చారా? అనే జాలి పలువురికి కలుగుతోంది. అందరికీ తెలిసిన వర్మ ఆలోచన సరళి ప్రకారం.. ఆయన ఎవ్వరినీ అతిగా ప్రేమించరు. అంటీముట్టనట్టుగా మాత్రమే వ్యవహరిస్తారు. కానీ ఇప్పుడు పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో చిక్కుకుపోయినట్టుగా కనిపిస్తోంది. ఆ పార్టీ కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకుంటున్నారని అందరికీ ఆయన పట్ల సానుభూతి అనిపిస్తోంది.
సాధారణంగా రాంగోపాల్ వర్మ ఎవ్వరి మీద ప్రత్యేకాభిమానం కలిగిఉండరు. ఎవరికోసం తాను సినిమా తీస్తారో.. ఆ సినిమా తీసినంత కాలం మాత్రమే.. సినిమాకు సంబంధించిన వాళ్ల మీద కాస్త ప్రేమ చూపిస్తుంటారు. అవన్నీ కూడా కేవలం.. ఆ సినిమా ప్రమోషన్ కోసం ఆయన అనుసరించే ఎత్తుగడలు మాత్రమే! ఒక విషయాన్ని త్రికరణశుద్ధిగా నమ్మడం వల్ల మాత్రమే తాను సినిమా చేశానని, అలాటి మాటల ద్వారా ఆయన బిల్డప్ ఇస్తుంటారు. కానీ, అదంతా కూడా కేవలం వర్మ అనుసరించే మార్కెటింగ్ టెక్నిక్ మాత్రమే.
వ్యూహం సినిమా తీసినప్పుడు కూడా రాంగోపాల్ వర్మ జగన్ ను ఇలాగే కీర్తించారు. ఆయన విధానాలు తనకు ఎంతో బాగా నచ్చాయని అన్నారు. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చెప్పే మెరమెచ్చు మాటలు. జగన్ కీర్తనల వరకే వర్మ పరిమితమైపోయి ఉంటే ఇవాళ అసలు ఏ కేసూ ఉండేది కాదు. కానీ వర్మ కాస్త అతి చేసి.. సోషల్ మీడియా లో చంద్రబాబు, పవన్ ల గురించి వెకిలిపోస్టులు పెట్టారు. బెడిసికొట్టి కేసుల దాకా వచ్చింది.
తీరా ఇప్పుడు కేసుల విచారణను ఎదుర్కొనే ప్రతి అడుగులోనూ వైసీపీ వారి సలహాలు తీసుకుంటూ, వారి సూచనల ప్రకారం నడుస్తూ వర్మ నెమ్మదిగా జగన్ ఉచ్చులో ఇరుక్కుపోయారు. పోలీసు విచారణకు వెళుతూ.. తన ఫోనును చెవిరెడ్డి భాస్కర రెడ్డి చేతికి ఇచ్చి, విచారణకు వెళ్లడం. పోలీసులు అడిగితే.. ఫోను కారులో హైదరాబాదు వెళ్లిపోయందని అబద్ధం చెప్పడం.. విచారణ నుంచి బయటకు వచ్చిన గంటన్నర వ్యవధిలోనే ఒంగోలు పోలీసుల విచారణ గురించి ట్వీట్ పెట్టడం ఇవన్నీ వర్మ అమాయకత్వాన్ని సూచిస్తున్నాయి. ఫోను హైదరాబాదు వెళ్లిందని వర్మ చెప్పిన నిమిషంలోపే.. ఆ ఫోను లొకేషన్ ట్రాక్ చేసిన పోలీసులు అది ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఉన్నట్టు గుర్తించారు. ఇలా వైసీపీ వారి సహకారంతో, సలహాలతో తప్పు మీద తప్పులు చేశారు.
రాజకీయ నాయకులు పోలీసుల విచారణను ఎదుర్కొనే తీరు వేరు. వారికి వేరే పని ఉండదు. పోలీసుల వద్దకు వెళుతూ వస్తూ ఉండడం కూడా వారికి పొలిటికల్ మైలేజీ ఇస్తుంది. కానీ వర్మ ఆ ఉచ్చులో చిక్కుకుంటే సాధించేదేం ఉండదు. ఆ సంగతి ఆయన తెలుసుకోవాలి.
వైసీపీ కార్యకర్తగా ముద్రవేయించుకుంటున్న వర్మ!
Thursday, March 20, 2025
