శాసనసభకు ఎందుకు రారు? అని ఎవ్వరు అడిగినా సరే.. ఇన్నాళ్లపాటూ జగన్మోహన్ రెడ్డి చాలా డాంబికంగా వారినే దబాయించే వారు! ‘ఆ విషయం మీరు నన్ను కాదు. స్పీకరును అడగాలి. నాకు ప్రతిపక్ష హోదా ఎందుకివ్వరో స్పీకరును అడగడండి’ అని రెచ్చిపోయేవాళ్లు. ‘కోర్టు పంపిన నోటీసులకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదో.. స్పీకరును నిలదీయండి’ అంటూ లేని నోటీసులను తానే సృష్టించి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేవారు. అనర్హత వేటు పడుతుంది కదా.. అంటే, వారు ఏం చేయగలిగితే అది చేసుకోమనండి.. ఎలాంటి పరిణామాలకైనా నేను సిద్ధం అని కూడా సవాళ్లు విసిరేవారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భయపడ్డారు. మడమ తిప్పారు. అసెంబ్లీ శాసనసభ సమావేశాలకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డిలో ఒక్కసారిగా ఇంత మార్పు ఎందుకొచ్చిందా? అని ఆరాతీస్తే.. పార్టీ ఎమ్మెల్యేలు తీసుకువచ్చిన ఒత్తిడే అందుకు కారణం అని తెలుస్తోంది.
ఒక ఎమ్మెల్యే కనీసం సహేతుక కారణంతో సెలవుచీటీ కూడా పంపకుండా, వరుసగా అరవై రోజుల పాటూ అసెంబ్లీకి రాకపోతే.. ఆ స్థానాన్ని స్పీకరు ఖాళీ అయినట్టుగా ప్రకటించవచ్చుననేది రాజ్యాంగం చెబుతున్న నిబంధన. కానీ సాధారణంగా ఇలాంటి అసాధారణ పరిస్థితులు ఎప్పుడూ తలెత్తవు. జగన్ లాంటి పెడసరపు నాయకులు గతంలో ఉండేవారు కాదు కాబట్టి.. ఈ నిబంధనకు అంతగా ప్రాచుర్యం లేదు. ఇప్పుడు ఆయన వైఖరితో.. ఈ నిబంధనను డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు తెరపైకి తెచ్చారు. పులివెందులకు ఉపఎన్నిక వస్తుందని కూడా జోస్యం పలికారు.
ఇక్కడ వైసీపీ సమస్య పులివెందుల ఉప ఎన్నిక కాదు! అక్కడ ఉప ఎన్నికవచ్చినాసరే.. మళ్లీ ఆయనే గెలుస్తారని అునకోవచ్చు. కానీ.. ఆయనకు ప్రతిపక్ష హోదా కోసం, ఆయన అలిగారని చెప్పి, సభకు వెళ్లకుండా బయటకూర్చుని డైలాగులు మాట్లాడుతున్న 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? వీరందరూ కూడా అనర్హులే అవుతారు కదా! మరి వీరి స్థానాలన్నింటికీ ఉప ఎన్నికలు వస్తే మళ్లీ నెగ్గగల ధైర్యం ఆ పదిమందిలో ఉన్నదా? అనేది కీలకం.
ఆ ఎమ్మెల్యేలు అందరూ.. ఇప్పటికే తమను గెలిపించిన ప్రజల నుంచి ఛీత్కారాలను ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేలను గెలిపించేదే శాసనసభకు వెళ్లి తమ నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించడానికి ఆ పని చేయకుండా నాటకాలాడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలను వారిని గెలిపించిన ప్రజలు చీదరించుకునే పరిస్థితి. వారందరూ కలిసి జగన్ మీద ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంద. జగన్ రాకపోయినా సరే తాము శాసనసభకు హాజరవుతామని చెప్పినట్టుగా తెలుస్తోంది. సోమవారం మొదలయ్యే సమావేశాలకు కూడా ఆ పదిమంది మాత్రమే వెళుతున్నారు. జగన్ మంగళవారం నుంచి సభకు వస్తారని చెబుతున్నారు. ఎమ్మెల్యే ఒత్తిడికి తలొగ్గకపోతే.. వారు పార్టీనుంచి జారుకుంటారేమో అనే భయంతోనే జగన్ మడమ తిప్పినట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మడమ తిప్పిన వేళ : ఎమ్మెల్యేల ఒత్తిడికి దిగొచ్చిన జగన్!
Friday, March 28, 2025
