ఇటీవలి కాలంలో సినిమా టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రేక్షకులు కొంత వెనకడుగు వేస్తున్నారు. ఒకప్పుడు కుటుంబంతో వెళ్లి సినిమా చూడడం సాధారణం కాగా, ఇప్పుడు టికెట్ రేట్లు పెరగడంతో చాలామంది ఆలోచించాల్సి వస్తోంది. ఈ ట్రెండ్ మొదలైనది దర్శకుడు రాజమౌళి సినిమాల విజయాల తర్వాతనే అని చాలామంది అంటున్నారు. ఆయన చిత్రాల స్థాయి, విజువల్స్ చూసి అభిమానులు ఎక్కువ ధరలు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా అదే విధంగా టికెట్ రేట్లు పెంచడం మొదలుపెట్టాయి. దాంతో సాధారణ ప్రేక్షకుడు థియేటర్‌కి వెళ్లే ముందు రెండుసార్లు ఆలోచిస్తున్నాడు.
ఇప్పుడు రాజమౌళి మళ్లీ ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ లెజెండరీ సినిమాను కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ వెర్షన్‌లో బాహుబలి రెండు భాగాలను కలిపి, కొత్తగా ఎడిట్ చేసి, రీమాస్టర్ చేసినట్లు సమాచారం. ఈ ప్రత్యేక వెర్షన్‌ను అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ సారి కూడా టికెట్ రేట్లు పెరుగుతాయా అన్న సందేహం ప్రేక్షకులలో ఉంది. కానీ చిత్ర బృందం తెలిపిన ప్రకారం ఎలాంటి ధరల పెంపు ఉండదని తెలుస్తోంది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సాధారణ టికెట్ ధరలకే ప్రదర్శించనున్నారు.
