అదానీ నుంచి ముడుపులు స్వీకరించిన వ్యవహారం ఒకవైపు రాష్ట్రంలో కాకపుట్టిస్తోంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో నింపాదిగా గడుపుతున్నారు. జగన్ తప్పు చేయలేదు- ఆయన సుద్దపూస- జగన్ అంతటి నిజాయతీ గల వ్యక్తి, అదానీతో కుదుర్చుకున్న నిజాయితీ అయిన ఒప్పందాలు మరొకటి చరిత్రలో ఉండవు గాక ఉండవు.. అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే రకరకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి బుకాయించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. జగన్ తీరుమీద పార్టీ నాయకులే ఆగ్రహంతో రగిలిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఆరోపణలు పూర్తిగా జగన్ మీద మాత్రమే వస్తుండగా.. ఆయన నోరువిప్పి మాట్లాడకుండా.. తమను మాత్రం మీడియా ముందుకు నెట్టి మాట్లాడమని చెప్పడం సబబు కాదని పార్టీ నాయకులే భావిస్తున్నారట.
రూ.1750 కోట్ల రూపాయల లంచాలు అంటే చిన్న విషయం కానే కాదు. జగన్ మోహన్ రెడ్డి మరియు ఆయనకు అత్యంత సన్నిహితులైన ఒకరిద్దరు మంత్రులు, వారి తరఫున వ్యవహారాలు చక్కబెట్టిన అధికారులు మాత్రం కుమ్మక్కై రెండో కంటికి తెలియకుండా ఇంత పెద్ద మొత్తం కాజేసిన వైనం పార్టీ నాయకులకే విస్మయం కలిగిస్తోంది. తాము పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక వ్యక్తులుగా ఉన్నామే గానీ.. కనీసం తమకు ఇలాంటి అవినీతి బాగోతం జరిగినట్టు కూడా తెలియదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. తమ కళ్లు గప్పి.. తానొక్కడే ఇంత సొమ్ము కాజేసిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు కష్ట కాలం వచ్చేసరికి మాత్రం తమను మీడియా ముందుకు నెట్టి మాట్లాడమని చెబుతుండడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము చెప్పే సమర్థింపు వాదనల వల్ల పార్టీకి వచ్చే లాభం కూడా లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి మాటల ద్వారా.. జగన్మోహన్ రెడ్డి సెకితో కేబినెట్ తీర్మానం ద్వారా కుదుర్చుకున్న ఒప్పందంలో కనీసం విద్యుత్తు మంత్రికి కూడా భాగం లేదని తేలిపోయింది. కేవలం పెద్దరెడ్డి గా ఆయన సూచించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మాత్రమే వ్యవహారం నడిపినట్టు అంతా నమ్ముతున్నారు. తీరా ఇప్పుడు లంచాల సంగతి బయటపడిన తర్వాత.. జగన్ గానీ, కనీసం పెద్దిరెడ్డి గానీ ఎక్కడా కనిపించడం లేదు. వైీసీ ప్రభుత్వం తప్పు చేయలేదని సమర్థించుకునే బాధ్యత మొత్తం ఇతర చిన్న నాయకుల మీదనే పడుతోంది. ఈ ధోరణి తగదని- జగన్ స్వయంగా మీడియా ఎదుటకు వచ్చి నోరు విప్పి చెప్పకపోతే.. తమ పార్టీని అభిమానించే ప్రజలు కూడా.. ఈ లంచాల వైనం నిజమే అని నమ్మే ప్రమాదం ఉన్నదని పార్టీ నాయకులు అంటున్నారు.
ఈ మౌనంతో నష్టం తప్పదు జగనన్నా!
Saturday, December 7, 2024