జగన్మోహన్ రెడ్డి సమయానుకూలంగా మాటలు మారుస్తూ.. తనకు అనుకూలమైన మాటలు వల్లిస్తూ ఉంటారు. ఎన్డీయే కూటమి సర్కారు ఏర్పడిన తొలినాటినుంచి కూడా.. జగన్ ప్రభుత్వం మీద నిందలు వేస్తూనే ఉన్నారు. కానీ.. సుమారు అయిదు నెలలు గడిచిన తర్వాత.. ఈ ప్రభుత్వానికి తాను యిచ్చిన (?) హనీమూన్ గడువు ముగిసిపోయిందని ఇక ఊరుకునేది లేదని హూంకరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకగా ప్రజాపోరాటాలు నిర్వహించాలని పిలుపు ఇచ్చారు. పోరాటాల ప్రణాళికను కూడా ప్రకటించారు.
అంతిమంగా సంక్రాంతి తరువాత.. తాను ప్రతి వారంలో రెండు రోజులు జిల్లాల్లో పర్యటిస్తానని, ఆ జిల్లాల్లోనే బసచేస్తానని.. ప్రభుత్వంపై పోరాటాలతో పాటు పార్టీ కార్యకర్తలతో నిత్యం సమావేశం అవుతుంటానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన విని పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం వచ్చింది. జగన్ జిల్లాల్లో పర్యటిస్తే పార్టీకి కాస్త జోష్ వస్తుందని అనుకున్నారు. కానీ.. సంక్రాంతి తర్వాత ముందుగా లండన్ యాత్రను ప్రారంభించిన జగన్ తిరిగి వచ్చేలోగా.. ఆయన పోరాడడానికి అంశాలేమీ మిగిలేలా లేవని పలువురు అంచనా వేస్తున్నారు. సొంత పార్టీ వారే పెదవి విరుస్తున్నారు.
జగన్ చాలా కాలంగా సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారు.. అని అడుగుతూ వచ్చారు. చివరికి ఆయన సొంత పార్టీలోని మాజీ మంత్రులకు ఉన్న రాజకీయ స్పృహ కూడా ఆయనకు లేకుండా పోయింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, జగన్ అపరిపక్వ ధోరణితో విసిగిపోయి పార్టీకి రాజీనామా చేస్తూ.. ప్రజలు అయిదేళ్ల పాటు పరిపాలించడానికి చంద్రబాబుకు అవకాశం ఇచ్చారని, అప్పటిలోగా హామీలు నెరవేర్చవచ్చునని, అలాంటిది అయిదు నెలల్లోనే జగన్ నానా యాగీచేస్తున్నారంటూ దెప్పిపొడిచారు. జగన్ సూపర్ సిక్స్ హామీల గురించి పదేపదే ప్రశ్నించేవారు.
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమేమో చెప్పారు- అంటూ వెటకారం చేసేవారు.
కానీ.. ఇప్పుడు జగన్ లండన్ నుంచి తిరిగివచ్చిన తర్వాత కూడా.. ఆయన జిల్లాల్లో యాత్రలు చేయాలని సంకల్పించినా కూడా.. విమర్శించడానికి అంశాలు లేకుండా పోతున్నాయి. సూపర్ సిక్స్ లో ఒకటైన దీపం పథకం కింద మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇచ్చే పద్ధతిని జగన్ దీపావళి నాడే ప్రారంభించేశారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉగాది నుంచి అమలవుతుందని అంటున్నారు. అలాగే, తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చే పథకం కూడా మే నెలలో ప్రారంభిస్తాం అని చంద్రబాబు చెబుతున్నారు. వీటికి తోడు కేంద్రం వాటాగా ఎంత నిఝధులొస్తాయో తేలిన వెంటనే రైతులకు అన్నదాతా సుఖీభవం అంటూ 20 వేల సాయం అందించే పథకానికి శ్రీకారం చుడతాం అని కూడా అంటున్నారు.
ఇలా సూపర్ సిక్స్ లో ప్రధానమైన హామీలన్నీ కార్యరూపం దాల్చేస్తున్నాయి. జగన్ లండన్ నుంచి విమానం దిగేలోగా.. ఆయన ప్రజల తరఫున పోరాడడానికి జిల్లాలు పర్యటించాల్సిన అవసరమే లేకుండా పోతుందేమో అని ప్రజలు అనుకుంటున్నారు.