తెలుగు రాష్ట్రాలకి చెందిన సినిమా ఎగ్జిబిటర్లు తాజాగా హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మొత్తం 65మంది థియేటర్ ల యజమానులు ఇందులో పాల్గొన్నారు. వారంతా సినిమా రంగంలో కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చించారు.
ఇటీవలి కాలంలో అద్దె విధానంతో సినిమాలను థియేటర్లలో ప్రదర్శించడం వల్ల పెద్ద మొత్తంలో నష్టాలు వస్తున్నాయని ఎగ్జిబిటర్లు చెప్పుకున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే తమకు గట్టిగా నష్టం వచ్చే ప్రమాదం ఉందని వారు స్పష్టం చేశారు. అందుకే ఇకపై అద్దె ప్రాతిపదికన సినిమాలను థియేటర్లలో పెట్టే ఉద్దేశం లేదని తేల్చేశారు.
తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిర్మాతల కౌన్సిల్‌తో పాటు, నిర్మాతల గిల్డ్‌కు అధికారికంగా తెలియజేయనున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. నిర్మాతలు తమ అభిప్రాయాన్ని గౌరవించకపోతే, వచ్చే జూన్ 1వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లోని థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు.