పేరు పరామర్శ యాత్ర.. లక్ష్యం పోలీసులకు బెదిరింపులే!

Friday, July 11, 2025

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పరామర్శ యాత్ర పేరుతో తన దురహంకారాన్ని ప్రదర్శించడానికి మరోమారు ప్రయత్నించారు. బెంగుళూరు ప్యాలెస్ లో విలాసంగా గడుపుతూ మధ్యమధ్యలో కాస్త గ్యాప్ దొరికినప్పుడు ఏపీలో అడుగుపెట్టి.. రాజకీయంగా విధ్వంసం అలజడులు సృష్టించి వెళ్లాలని కలలు కంటూ ఉండే జగన్మోహన్ రెడ్డి.. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి చేసిన యాత్ర ఆద్యంతం ఆయన వ్యవహార సరళికి, దుర్బుద్ధులకు నిదర్శనంగానే నిలిచింది. కేవలం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండడానికి పరిమిత సంఖ్యలో కార్యకర్తలతో, వాహనాలతో  కార్యక్రమానికి రావాలని పోలీసులు సూచిస్తే.. కావాలనే వాటిని ఉల్లంఘించిన జగన్మోహన్ రెడ్డి.. తీరా కార్యక్రమం ముగిశాక.. పోలీసులనే బెదిరిస్తూ దాష్టీకం ప్రదర్శించారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం అయిదేళ్లపాటు అధికారంలో ఉంటుందనే కనీస జ్ఞానం కూడా లేకుండా.. ఓడిపోయిన తొలినాటినుంచి రెండు మూడేళ్లలో నేను మళ్లీ అధికారంలోకి వస్తా.. అంటూ ప్రగల్భాలు పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్లలో కూడా అదే పనిచేశారు. ‘పోలీసు శాఖలో అందరూ కాదు.. కొందరున్నారు. వారికి చెబుతున్నా. చంద్రబాబు ఎల్లకాలం అధికారంలో ఉండరు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్కొక్కడికీ సినిమా చూపిస్తాం’ అంటూ జగన్ పోలీసులను బెదిరించారు.

నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్రకు పోలీసులు ఎంతో బాగా సహకరించారని చెప్పాలి. ఎందుకంటే.. ఆయన అన్ని రకాలుగా పోలీసులు విధించిన ఆంక్షలను ఉల్లంఘించినప్పటికీ కూడా.. పోలీసులు ఎక్కడా తీవ్రంగా వ్యవహరించలేదు. భారీగా పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. దారి పొడవునా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. కానీ జగన్ దళాల వ్యవహార సరళే దుర్మార్గంగా సాగింది. వారి కాన్వాయ్ లోని వాహనం ఢీ కొనడంతో గుంటూరుసమీపంలో ఒక వృద్ధుడు మరణించాడు. జగన్ కార్యకర్తలు అతడిని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. స్థానికులు గుర్తించి అతడిని ఆస్పత్రికి తరలించరేసరికే అతను మరణించాడు. జగన్ .. తన కాన్వాయ్ కారణంగా జరిగిన మరణానికి సంబంధించి కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. కానీ.. పోలీసులను నిందించడానికి బెదిరించడానికి మాత్రం ఎగబడుతున్నారు. తన చవకబారు రాజకీయ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. పోలీసులను నిందించడం ద్వారా.. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్ పరిపాలన కాలంలో.. రాష్ట్రంలోని మొత్తం పోలీసు యంత్రాంగాన్ని తమ తొత్తుల్లా వాడుకుంటూ, చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రత్యర్థులను వేధించారని ఆరోపణలున్నాయి. అప్పటిలాగానే ఇప్పుడు కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదనే అనుమానాన్ని ప్రజల్లో నాటడానికి జగన్ ప్రయత్నిస్తుండడం గమనించాలి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles