‘అప్పుడు- ఇప్పుడు’ అంటూ నెత్తిమీద జుట్టు మొలిపించే డాక్టర్లు, భారీకాయుల్ని బక్కగా మార్చేసే డాక్టర్లు- జిమ్ ట్రైనర్లు రెండేసి ఫోటోలు చూపించి.. తమ గురించి తాము సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటారు కదా! ఇప్పుడు అలాంటి ఒక సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోండి. ‘అప్పుడు- ఇప్పుడు’ అంటూ మొన్నటిదాకా సాగిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన రోజుల పరిస్థితులను, ఇప్పుడు చంద్రబాబునాయుడు పరిపాలనలో సాగుతున్న పరిస్థితులను బేరీజు వేసుకోండి. ప్రత్యేకించి.. ఏపీనుంచి ముఖ్యమంత్రి దేశ రాజధాని ఢిల్లీకి వెళితే అక్కడి స్పందన, పరిస్థితులు ఎలా ఉండేవో బాగా జ్ఞాపకం చేసుకోండి. చంద్రబాబునాయుడు ఎందుకు అద్భుతమైన నాయకుడూ.. ఎంతటి మొనగాడో మీకే బాగా అర్థం అవుతుంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్ర పురోభివృద్ధికోసం అనేక అంశాలను సాధించుకువచ్చే కృషిలో ఉన్నారు. ఇప్పటికే విశాఖ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం శంకుస్థాపనకు ముహూర్తం కుదిరింది. ప్రధాని చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అలాగే అమరావతి పనులకు పూర్తి సహకారం అందించబోతున్నట్టుగా ప్రధాని స్వయంగా హామీ ఇచ్చారు. గత డీపీఆర్ కంటే సుమారు 12 వేల కోట్ల రూపాయల అదనపు అంచనాలతో రూపొందించిన పోలవరం ప్రాజెక్టు తాజా డీపీఆర్ లు కూడా ఆమోదం పొందాయి. ప్రస్తుతానికి తొలివిడతా 2800 కోట్లుమంజూరు అవుతున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే రైల్వేజోన్ మంజూరు కావడం దానికి సంబంధించి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తో చంద్రబాబునాయుడు సాగించిన మంతనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చంద్రబాబు ప్రధాని మోడీ కలిసి, రైల్వేజోన్ పనుల శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. ఆయన అంగీకరించారు. ఆ వెంటనే వన్ జన్ పథ్ లోని చంద్రబాబు అధికారిక నివాసానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా వచ్చారు. జోన్ కు సంబంధించి మిగిలిన వ్యవహారాలన్నీ ఆయన చంద్రబాబు వద్దకు తానే స్వయంగా వచ్చి మరీ మాట్లాడారు.
ఇలాంటి పరిస్థితి గత అయిదేళ్లలో తెలుగు ప్రజలు ఎన్నడైనా చూశారా?
జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం.. కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ల కోసం రోజుల తరబడి నిరీక్షించడం, దొరికితే వారిని కలిసి.. ఆ తర్వాత ప్రెస్ మీట్ర్ కూడా పెట్టకుండా తాడేపల్లికి వచ్చేయడం మాత్రమే జరిగేది. చాలా సందర్భాల్లో జగన్ రెండు మూడురోజులు ఢిల్లీలో తిష్టవేసి అసలు అపాయింట్‌మెంట్లు దొరక్కుండా ఖాళీ చేతులతో తిరిగివచ్చిన సందర్భాలున్నాయి. అదే చంద్రబాబు వెళితే.. ఆయన నివాసానికి కేంద్రమంత్రి వచ్చి.. ఏపీకి కేంద్రం తరఫున ఏం చేయబోతున్నారో వివరించి వెళ్లడం జరుగుతోంది.
తెలుగుదేశం, చంద్రబాబు అభిమానులు మాత్రం.. ‘‘గట్లుంటది మరి చంద్రబాబుతోని..’’ అని మురిసిపోతున్నారు.
గట్లుంటది మరి చంద్రబాబుతోని..!
Saturday, November 9, 2024