హస్తినాపురం ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కే పట్టం కట్టారు. మోడీ సర్కారు గురించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎంతగా భయపెట్టాలనుకున్నప్పటికీ వారి పాచికలు పారలేదు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అంతో ఇంతో తమ బలం చూపించుకోవాలని పడిన ఆరాటం కూడా ఫలించలేదు. ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి విస్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. సుదీర్ఘ విరామం తరువాత హస్తిన అసెంబ్లీ పీఠంపై భారతీయ జనతా పార్టీ కొలువు తీరనుంది. 70 సీట్లున్న అసెంబ్లీలో 36 సీట్లు అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కాగా.. ఎగ్జిట్ పోల్ అంచనాలను కూడా మించిపోయేలా భాజపా 48 సీట్లు సాధించింది ఆప్.. కేవలం 22 సీట్లతో సర్దుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడం విశేషం.
ఆమ్ ఆద్మీ పట్ల ఢిల్లీ ప్రజల్లో విశ్వాసం పూర్తిగా సన్నగిల్లిపోయిందనడానికి సీట్ల సంఖ్యకు మించిన ఉదాహరణలు ఉన్నాయి. ఆ పార్టీ అధినాయకుడు అరవింద్ కేజ్రీవాల్, ఆయన జైలు జీవితం తర్వాత కొన్నాళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న అతిశీ కూడా ఎమ్మెల్యేలుగా నెగ్గలేకపోయారు. దీనిని బట్టి చూస్తే.. ఆ పార్టీ తరఫున నెగ్గిన 22 మంది ఎమ్మెల్యేలు కూడా ఏదో వారి నియోజకవర్గాల్లో తమ సొంత బలంతో నెగ్గారే తప్ప.. ఆ పార్టీ ప్రాభవం, అరవింద్ కేజ్రీవాల్ ప్రజాదరణ అన్నీ మంటగలిసిపోయాయని అర్థం చేసుకోవచ్చు.
అవినీతి వ్యవహారాలే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని కుప్పకూల్చాయి. చైతన్యవంతులైన ఢిల్లీ ప్రజలు ఆప్ అవినీతిని ఏమాత్రం సహించలేకపోయారు. పైగా సాధారణంగా రాజకీయ నాయకుల అవినీతిని ప్రజలు చూసీ చూడనట్టు వ్యవహరిస్తారేమో గానీ.. ప్రత్యేకించి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో రాజీపడకపోవడానికి కారణం ఉంది. ఆయన అసలు రాజకీయ పార్టీ స్థాపించడమే అవినీతికి వ్యతిరేకంగా నిర్మితమైన పునాదుల మీద జరిగింది. రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా జనలోక్‌పాల్ ఉద్యమంతో అందరి దృష్టిలో పడిన కేజ్రీవాల్ తర్వాత రాజకీయ పార్టీ పెట్టారు. ఢిల్లీ కి వరుసగా మూడుసార్లు సీఎం అయ్యారు. ఆ తర్వాత..అవినీతి ఆరోపణలు ముప్పిరిగొన్నాయి.
ఈలోగా.. కేజ్రీవాల్ ప్రధాని పదవి మీద కన్నేశారు. పంజాబు లో రకరకాల కారణాల వల్ల ఆప్ పార్టీ విజయం సాధించడం ఆయన ఆశలను పెంచింది. ఇండియా కూటమికి తాను సారథ్యం వహించాలని అనుకున్నారు. తనను ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఆశించారు. ఈలోగా అవినీతి ఆరోపణలన్నీ వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ బిఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత పాత్రధారిగా ఉన్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, అధికారనివాసానికి కేజ్రీవాల్ 33 కోట్ల రూపాయలతో రిపేర్లు చేయించినట్టు శీష్ మహల్ ఆరోపణలు అన్నీ కలిసి ఆ పార్టీని శిథిలం చేసేశాయి.
డబుల్ ఇంజిన్’కే హస్తిన పట్టాభిషేకం!
Wednesday, March 19, 2025
