తిరుపతి డిప్యూటీ మేయరు స్థానానికి జరిగిన ఉపఎన్నిక విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఎంతటి దిగజారుడు రాజకీయాన్ని ప్రదర్శించవచ్చునో తారస్థాయిలో నిరూపించింది. తమ పార్టీని వద్దనుకుని తెలుగుదేశంలో చేరిన కార్పొరేటర్లను బెదిరించడం ఒక ఎత్తు, వారిని కిడ్నాప్ చేసి నిర్బంధించి.. తమకు అనుకూలంగా మాత్రమే ఓటు వేయాలంటూ హెచ్చరించడం ఒక ఎత్తు, ఎన్నిక ముగిసిన తర్వాత కూడా బెదిరింపుల పర్వానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా.. వారిని భయపెట్టి తమ కాళ్లు మొక్కించుకోవడం ఒక ఎత్తు.. వీటన్నింటినీ మించి తమ సొంత పార్టీ ఎమ్మెల్సీ అనారోగ్యం కారణంగా.. ఓటింగుకు హాజరు కాలేని స్థితిలో ఇంట్లో ఉంటే.. ఆయనను తెలుగుదేశం వారు కిడ్నాప్ చేశారంటూ కట్టుకథలు అల్లి విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా.. రాష్ట్ర ప్రజలందరి దృష్టిని ఆకర్షించడానికి కుటిల యత్నం చేయడం మాత్రమే మరొక ఎత్తు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ వారు అనుసరించిన ఈ దుర్మార్గపు పోకడల మీద వారి సొంత ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఒక రేంజిలో మండిపడుతున్నారు.
సిపాయి సుబ్రమణ్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. తెలుగుదేశంలో ఉన్న ఆయనకు తమ పార్టీ కండువా కప్పి కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనను ఎమ్మెల్సీగా మండలికి పంపారు అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి. తిరుపతి నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సమయంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కూడా ఎక్స్ అఫీషియో మెంబరు ఓటరుగా నమోదు చేయించుకున్నారు.
నిజానికి తిరుపతి కార్పొరేషన్ లో 49 మంది కార్పొరేటర్లు ఉండగా.. ప్రస్తుతం 47 స్థానాలే ఉన్నాయి. సిపాయితోపాటు, వైసీపీ ఎంపీ గురుమూర్తి, జనసేన ఎంఎల్ఏ ఆరణి శ్రీనివాసులు కూడా ఎక్స్ అఫీసియో ఓటర్లుగా ఉన్నారు. మొత్తం 50 ఓట్లు.
22 మంది వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీ రాజకీయం వద్దనుకుని ముందే తెలుగుదేశంలోకి చేరిపోయారు. తాజాగా ఓటింగు నాటికి మరో నలుగురు కూడా అదే బాటపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. భూమన అభినయ్ రాజీనామా వల్ల వచ్చిన ఉప ఎన్నికను దక్కించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గి తీరాలని, ప్రతి ఒక్క ఓటును చాలా విలువైందిగా భావించింది వైసీపీ. అయితే వారి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం.. అనారోగ్యం కారణంగా సోమవారం ఓటింగుకు రాలేదు. ఆరోజు కోరం లేక ఎన్నికే వాయిదా పడింది. అయినా సరే.. సిపాయి ని తెలుగుదేశం వారు కిడ్నాపు చేసినట్టుగా ఒక పుకారు పుట్టించారు.
దీంతో తమ వారి తీరుపై ఆగ్రహించిన సిపాయి సుబ్రమణ్యం తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, కేవలం అనారోగ్య కారణాల వల్ల ఓటింగుకు వెళ్లలేకపోయానని ఒక వీడియో విడుదల చేయాల్సి వచ్చింది. వైసీపీ వారి నీతి మాలిన రాజకీయాలకు ఇది నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కిడ్నాప్ కట్టుకథలపై ‘సిపాయి’ గుస్సా!
Wednesday, February 12, 2025
