తెలుగు భాషలో కోతిపుండు బ్రహ్మరాక్షసి అనే ఒక సామెత ఉంటుంది. సహజంగా ఎక్కువగా ఇంగ్లిషు సాహిత్యం చదువుతూ ఉండే మేధావి దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఈ సామెత తెలిసి ఉండకపోవచ్చు. తెలిసినా ఆ సామెత అర్థం ఏమిటో తెలియకపోవచ్చు. కోతులు సహజంగా గుంపులుగా మాత్రమే జీవిస్తుంటాయి. ఒక కోతికి ఏదైనా గాయమైందంటే.. మిగిలిన కోతులన్నీ కలిపి ఆ గాయాన్ని తమ గోళ్లతో కెలికి.. రకరకాల సొంత వైద్యం చేయడానికి ప్రయత్నించి.. ఆ కోతిపుండు బ్రహ్మరాక్షసి అంత పెద్దదయ్యేందుకు కారణం అవుతాయి. అంటే చాలా చిన్న సమస్యను.. తమ అతి తెలివి, అజ్ఞానం కారణంగా అతి పెద్ద సమస్యగా మార్చుకుంటూ పోతే దానిని కోతిపుండు బ్రహ్మరాక్షసి అని అంటారు.
ఇప్పుడు జగన్ ఆశ్రిత సినిమాదర్శకుడిగా ముద్రపడిన రాంగోపాల్ వర్మ పరిస్థితి అలాగే ఉంది. ఆయనమీద నమోదైనది చాలా చిన్న కేసు. నిజాయితీగా పోలీసుల ఎదుటకు వెళ్లి.. తన వివరణ ఏమిటో చెప్పేసి.. అప్పట్లో సినిమా ప్రమోషన్ కోసం చేసే రకరకాల ప్రయత్నాల్లో భాగంగా.. ఆ పోస్టులు కూడా పెట్టానని లెంపలు వాయించుకుని ఉంటే సరిపోయేది. వీరబీభత్సమైన శిక్షలు కూడా పడే అవకాశం లేదు. కేవలం జరిమానాతో చెల్లిపోయిఉన్నా ఆశ్చర్యం లేదు. అలాంటిది.. రాంగోపాల్ వర్మ ఆ చిన్న వ్యవహారాన్ని చాలా పెద్ద సమస్యగా మార్చుకున్నారు. పోలీసులు పిలిచినప్పుడు వెళ్లకుండా, స్పందించకుండా, కోర్టులో కేసులు వేయడం ద్వారా.. అడ్డమైన సవాళ్లు విసరడం ద్వారా.. ఒకవైపు పరారీలో ఉంటూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ పోలీసులను రెచ్చగొట్టడం ద్వారా రాం గోపాల్ వర్మ.. అనేక దుందుడుకు చర్యలకు పాల్పడ్డారు. వాటన్నింటి పర్యవసానమే ఆయన మీద కేసు బాగా ముదిరిపోయింది ఇప్పటికి కూడా విచారణలో పోలీసులకు సహకరించకుండా.. కేసును బాగా ముదరబెట్టుకుంటున్నారు వర్మ!
పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించడం వరకు ఓకే. అలాంటి భయం ఎవ్వరికైనా ఉంటుంది. కానీ వర్మ చేసిన చేష్టలు వేరు. తానేదో మానవాతీతుడు అయినట్టుగా.. విచారణను ప్రతి సందర్భంలో ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తూ.. వాయిదాలు కోరుతూ వచ్చారు. తనంతటి బిజీ దర్శకుడు మరొకరు లేరన్నట్టుగా ప్రతిసారీ షూటింగులున్నాయి.. నేను ఒక్కరోజు లేకపోతే నా నిర్మాతలు నష్టపోతారు అంటూ బుకాయించడానికి ప్రయత్నించారు. స్టేషనుకు రావాల్సిన అవసరం ఏంటి.. నన్ను వర్చువల్ విధానంలో ఆన్ లైన్ లో విచారిస్తే సరిపోతుంది కదా.. అని పోలీసులకు కొత్త సవాళ్లు విసిరారు. చివరికి హైకోర్టు ఒకవైపు బెయిలు ఇస్తూనే.. స్టేషనుకు వెళ్లాలని హుకుం జారీచేసింది. ఒంగోలు పోలీసుల ఎదుట హాజరైన రాంగోపాల్ వర్మ.. మళ్లీ యథావిధిగా విచారణకు సహకరించకుండా పెడసరంగా వ్యవహరించి.. ఇంకా పీకలదాకా కూరుకుపోతున్నారు. ట్విటర్ ఖాతా నాదే.. కానీ పోస్టులు పెట్టింది నేను కాదు.. అటూ ఇప్పుడు కొత్త పాట ఎత్తుకున్నారు. ఇన్నాళ్లూ ప్రతి ఇంటర్వ్యూల్లో అవును పోస్టులు పెట్టాను.. ఇన్నాళ్ల తర్వాత కేసేంటి అంటూ పెడసరం మాటలు చెప్పిన ఆయన ఇప్పుడు ఏకంగా మాట మార్చారు. మొత్తానికి వర్మ మరింత ఘాటుగా కేసులో కూరుకుంటున్నట్టు అనిపిస్తోంది.
ఆర్జీవీ గొడవ : కోతిపుండు బ్రహ్మరాక్షసి!
Thursday, March 20, 2025
