అధికారంలో ఉన్నవారు.. తమకు ఎదురేముందిలే అనే పొగరుతో కొన్ని ఆక్రమణలు, కబ్జాలు చేస్తుంటారు. అయితే అలాంటివి వివాదంగా మారినప్పునడు గుట్టుచప్పుడు కాకుండా వదిలేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అహంకారం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అటు ప్రభుత్వ భూములను, అటవీ భూములను, బుగ్గమఠానికి చెందిన భూములను కూడా ఆక్రమించి కబ్జా చేసిన కేసులను ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. మఠం భూముల విషయంలో పద్ధతిగా తన సంజాయిషీలు కూడా చెప్పకపోగా.. సుప్రీం కోర్టు వరకు వెళుతూ న్యాయపోరాటానికి సిద్ధపడడం పలువురికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది కేవలం అహంకారంతో కూడిన దాష్టీకం అని ప్రజలు అనుకుంటున్నారు.
తిరుపతిలో ముత్యాలరెడ్డి పల్లె పరిధిలో బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల కోట్ల విలువైన భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించారనేది ఆరోపణ. ఈ భూముల విషయంలో బుగ్గమఠం కార్యనిర్వహణాధికారి ఆయనకు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. ఒక్కదానికి కూడా పెద్దిరెడ్డి పద్ధతిగా స్పందించలేదు. స్వయంగా వచ్చి వివరణ ఇవ్వలేదు. ప్రతి నోటీసుకు కూడా.. తాను ప్రజాప్రతినిధిని అని ముందుగా నిర్ణయించిన అనేక కార్యక్రమాలుంటాయని.. నోటీసులకు స్పందించి విచారణకు రాలేనని జవాబులు ఇచ్చారు. తన వద్ద ఉన్న రికార్డులతో తన మనుషులను మాత్రమే పంపారు. చిట్టచివరకు బుగ్గమఠం ఈవో ఆక్రమించిన భూములను ఖాళీ చేయాలంటూ పెద్దిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆక్రమించిన భూములకోసం ఏకంగా కోర్టుకే వెళ్లడం ఒక చిత్రం. కాగా, ఈ భూముల వివాదంలో అభ్యంతరాలుంటే.. దేవాదాయశాఖ ట్రైబ్యునల్ ను సంప్రదించాలి తప్ప.. నేరుగా హైకోర్టుకు రావడానికి వీల్లేదని హైకోర్టు తీర్పుచెప్పింది. ఈ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పెద్దిరెడ్డి ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఈ విషయంలో కౌంటరు వేయడానికి సుప్రీం రాష్ట్ర సర్కారుకు ఒక వారం గడువు ఇచ్చింది.
అయితే కబ్జారాయుళ్లు కూడా కోర్టు ద్వారా ఊరటపొందడానికి తెగించడం ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వ అటవీభూములను కాజేయడం మాత్రమే కాకుండా.. ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన మఠం భూములను కూడా మింగేసి.. వాటికోసం పెద్దిరెడ్డి సాగిస్తున్న న్యాయపోరాటం.. పద్ధతి ప్రకారం ఈవో విచారణకు హాజరుకాకపోగా, దేవాదాయ శాఖ ట్రైబ్యునల్ కు వెళ్లడానికి కూడా ఇష్టపడకపోవడం ఇవన్నీ ప్రజలకు చాలా అనుమానాలు కలిగిస్తున్నాయి.
మఠం భూములు ఆక్రమించి.. పెద్దిరెడ్డి దాష్టీకం!
Thursday, June 19, 2025
