కేంద్ర ఉక్కు మరియు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఇటీవల విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించి.. రాష్ట్రానికి ఒక శుభవార్తను అందించారు. విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ ఉండదని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు ను లాభాల బాటలో నడిపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అయితే.. ఆయన ఒక చిన్న సందేహాన్ని ప్రజల మదిలో వదలిపెట్టారు. తాను ఢిల్లీ వెళ్లిన తర్వాత ప్రధాని మోడీతో మాట్లాడి.. అధికారికంగా ప్రెవేటీకరణ లేదనే సంగతిని ప్రకటిస్తానని ఆయన చెప్పారు. అందువల్ల ప్రజల్లో చిన్న సందేహం మిగిలిపోయింది.
కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా పూనుకున్నారు. నిజానికి కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో గత అయిదేళ్లలో కూడా జనసేన భాగస్వామి అయినప్పటికీ.. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో జరుగుతున్న పోరాటానికి బాహాటంగా వెళ్లి మద్దతు ఇచ్చిన ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్. ప్రెవేటీకరణ ఆపడానికి మోడీ, అమిత్ షాలతో మాట్లాడతానని అప్పట్లోనే ప్రకటించారు. తాజాగా కుమారస్వామి పర్యటన తర్వాత.. ప్రెవేటీకరణ ఆపే దిశగా ఆశావహ సంకేతాలు కనిపిస్తుండగా.. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అందుకు పూనుకుంటున్నారు.
కేవలం విశాఖ ఉక్కు సంగతి మాత్రమే కాదు, విశాఖ రైల్వేజోన్ గురించి కూడా కేంద్రంలోని పెద్దలతో మాట్లాడతానని, ఉద్యోగాలకోసం కూడా అర్థిస్తానని ఆయన అంటున్నారు. తమ పార్టీకి కూడా ఇద్దరు ఎంపీలు ఉన్నప్పటికీ, తాము కేంద్రంలోని కూటమిలో భాగస్వాములం అయినప్పటికీ.. ఒక్క మంత్రి పదవి కూడా అడగకుండా త్యాగం చేసిన పవన్ కల్యాణ్ ఒత్తిడిచేస్తే విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ ఆపడం పెద్ద విషయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
విశాఖ ఉక్కు సాధించడానికే అప్పట్లో చాలా పోరాటాలు జరిగాయి. ఇప్పుడు దానిని నిలబెట్టుకోవడానికి కూడా అంతేస్థాయిలో పోరాటాలు జరుగుతూ వచ్చాయి. కాగా.. కేంద్రం ఈ విషయంలో కాస్త మెత్తబడినట్లే పలువురు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా పవన్ కూడా పూనుకోవడం.. అధికారిక శుభవార్తను త్వరలోనే వినిపిస్తుందని ఆశిస్తున్నారు.
ఆ శుభవార్తను మరింత పక్కా చేస్తున్న పవన్!
Friday, September 20, 2024