సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలోనే చంద్రబాబునాయుడు పీ4 అనే మాటను తొలిసారిగా ప్రకటించారు. పేదల అభ్యున్నతి, పేదల వికాసం, పేదరికం నిర్మూలన అనే లక్ష్యాలను సాధించడానికి దార్శనిక నాయకుడైన చంద్రబాబునాయుడు చేసిన సరికొత్త ఆలోచన ఇది. రాష్ట్రంలోని నిరుపేదలు అందరినీ కూడా సంపన్నులుగా మార్చేందుకు తాను కట్టుబడి ఉంటానని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆ పీ4 విధానానికి మౌలిక స్వరూపం ఏమిటో ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే విధానాన్ని ఉగాది పర్వదినం నాటినుంచి ప్రారంభించబోతున్నట్టుగా ముఖ్యమంత్రి వెల్లడించారు.
పీ4 అంటే.. పబ్లిక్- ప్రైవేట్- పీపుల్స్- పార్టనర్‌షిప్ అని చంద్రబాబునాయుడు అంటున్నారు. సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూత ఇవ్వడం అనేది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. పీ4 చేయూత యొక్క విధివిధానాలు ఎలా ఉండాలో ఏకపక్షంగా ప్రభుత్వమే నిర్ణయించకుండా.. ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు స్వీకరించనున్నారు.
స్థూలంగా చంద్రబాబు మాటలను బట్టి అర్థమవుతున్నది ఇదీ.. పేదల అభ్యున్నతికోసం ఉద్దేశించిన ప్రాజెక్టులకోసం సమాజంలోని సంపన్న వర్గాల వారు తమ సొంత డబ్బును పెట్టుబడిగా పెడతారు. ఆలోచనలు, కష్టించే తత్వం, వ్యాపారం చేయయగల నైపుణ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ.. ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల.. వెనుకబడి ఉండే పేద వర్గాలకు ఇది వరంలా ఉపయోగపడుతుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే సీడ్ ఫండింగ్ కు విస్తృతరూపం అనవచ్చు. ఆ ప్రాజెక్టులో పనిచేసే పేదలు ఒక్కరూపాయి పెట్టుబడి పెట్టకుండా- డబ్బు పెట్టుబడి పెట్టగల సంపన్నులతో కలిసి వాటాదారులుగా ఉండగలుగుతారు.
ఈ వ్యవహారంలో ఉభయపక్షాల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి మోసాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఒక సంధానకర్త పాత్ర పోషిస్తుంది. అటు పెట్టుబడులు పెట్టేవారికి, ఇటు సాయం పొందే పేదలకు కూడా ఒక భరోసాను అందిస్తుంది. మోసాలకు తావివ్వని వాతావరణాన్ని ఏర్పాటుచేస్తుంది. తద్వారా ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం కూడా ఒక భాగస్వామిగా ఉంటుంది. అందుకే దీనిని ‘‘పబ్లిక్ (ప్రభుత్వం)- ప్రైవేట్ (పెట్టుబడులు పెట్టే సంపన్నులు)- పీపుల్స్ (చేయూత పొందే పేదప్రజలు- పార్టిసిపేషన్’’ అనగా పీ4 అని వ్యవహరిస్తున్నారు. ఈ విధానం చంద్రబాబు కలగంటున్నట్టుగా కార్యరూపం దాలిస్తే.. చిన్న చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు, ఉత్పాదక వ్యవస్థల పరంగా రాష్ట్ర రూపురేఖలు మారుతాయని ప్రజలు అనుకుంటున్నారు.
పీ4 : పేదల వికాసంలో ఒక కొత్త శకం!
Sunday, February 16, 2025
