తమను ఛీకొట్టి వెళుతున్న వారిని కూడా బలవంతంగా నిర్బంధించడం.. కిడ్నాపులు, దౌర్జన్యాలు వంటి అనేక దౌర్జన్యాలకు పాల్పడినప్పటికీ.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తిరుపతి నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ కు, అంతకు మించి భూమన తండ్రీ కొడుకులకు పరాభవం తప్పలేదు. విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ.. వారు తమ పంతం నెగ్గించుకోలేకపోయారు. ఉప ఎన్నిక ఓటింగ్ ప్రకటించిన సోమవారం నాడు.. తెలుగుదేశం వైపు మొగ్గిన కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి మాటలు చెప్పినా కూడా ఫలితం దక్కలేదు. అంతిమంగా జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుపతి నియోజకవర్గంలో.. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని తెలుగుదేశానికి చెందిన మునికృష్ణ గెలుచుకున్నారు.
జగన్ ప్రభుత్వ కాలంలో జరిగిన ఎన్నికల్లో తిరుపతి మునిసిపల్ స్థానాన్ని వైసీపీ ఘనంగానే గెలుచుకుంది. మునిసిపల్ ఎన్ని రకాల అకృత్యాలకు పాల్పడవచ్చునో అన్ని దురాగతాలూ చేయడం ద్వారా.. మొత్తం 49 స్థానాల్లో 48 వైసీపీ పరం అయ్యాయి. అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి కార్పొరేషన్ పెత్తనాన్ని కోరుకున్నారు. మేయరు స్థానం మహిళలకు రిజర్వు కావడం వల్ల ఆయన డిప్యూటీ మేయరు అయ్యారు. పెత్తనం మొత్తం తన చేతులమీదుగానే సాగించారు. అరాచక డిప్యూటీ మేయరుగా పేరు తెచ్చుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత.. కొడుకును మరింత బలమైన నాయకుడిగా తయారు చేయడానికి టీటీడీ డబ్బు కూడా దోచిపెట్టాలనుకున్నారు గానీ.. వర్కవుట్ కాలేదు. అయితే.. తన ఎమ్మెల్యే పదవికి వారసుడిగా తేవాలన్న ప్రయత్నానికి జగన్ ఆమోదం వచ్చింది. ఎమ్మెల్యేగా పోటీచేయడం కోసం కార్పొరేటర్, మరియు డిప్యూటీ మేయర్ పదవులకు అభినయ్ రాజీనామా చేశారు. ఆ డిప్యూటీ స్థానానికే ఇప్పుడు ఎన్నిక జరిగింది.
అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. ఏకంగా 22 మంది తెలుగుదేశంలో చేరిపోయారు. మరో అయిదుగురు చేరడానికి నిర్ణయించుకున్నారు. వారు కూడా చేరితే ఓటమి గ్యారంటీ అని భావించిన అభినయ్ రెడ్డి.. సోమవారం ఓటింగు నాడు.. నానా బీభత్సం సృష్టించారు. వారిని నిర్బంధించి.. అసలు వైసీపీ వారెవ్వరూ ఓటింగుకు వెళ్లకుండా చేశారు. దాంతో ఓటింగ్ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం నాడు.. 22 మంది తెదేపా కార్పొరేటర్లు ఓటింగుకు హాజరై వెనుతిరగాల్సి వచ్చింది. తీరా మంగళవారం జరిగిన ఓటింగులో తెలుగుదేశం అభ్యర్థి మునికృష్ణకు 26 ఓట్లు వచ్చి గెలుపొందారు. వైసీపీకి కేవలం 21 మాత్రమే వచ్చాయి.
ఎన్ని రకాల అడ్డదారుల్లో నిర్బంధించే ప్రయత్నాలు చేసినా.. తిరుపతిలో భూమన తండ్రీ కొడుకులకు పరాభవం తప్పలేదు..
భూమనకు పరాభవమే.. దౌర్జన్యాలు సాగలేదు!
Sunday, February 16, 2025
