ఎజెండా మాత్రమే.. ఆమెకు లాజిక్ అక్కర్లేదు!

Wednesday, July 16, 2025


రాహుల్ గాంధీ గుడ్ లుక్స్ లో ఉండాలనేది.. ఆయనను ప్రశంసిస్తూ పీసీసీ చీఫ్ గా తన పదవిని సురక్షితంగా కాపాడుకోవాలనేది.. రాహుల్ కళ్లలో ఆనందం చూడగలిగేలా, ప్రధాని నరేంద్రమోడీ మీద బురద చల్లుతూ ఉండాలనేది మాత్రమే ఆమె ఎజెండా! ఆమె ఏం మాట్లాడినా, ఏం చేసినా.. ఆ ఎజెండాను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారు. లాజిక్ ఏకొంచెమైనా అనవసరం అని కూడా ఆమె అనుకుంటారు. తాజాగా, అమరావతి రాజధాని నగర పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ రానున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల మాట్లాడుతున్న మాటలు, వినిపిస్తున్న డిమాండ్లు ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.

వైఎస్ షర్మిలకు సంబంధించినంత వరకు ఉండేది ఒకటే రాజకీయ ఎజెండా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నది గనుక.. వారు ఏం చేసినా సరే.. దానిని కేంద్రానికి ముడిపెట్టి.. కేంద్రాన్ని నరేంద్రమోడీని తప్పుపడుతూ ఏదో ఒక మాట మాట్లాడడం. ఆవు వ్యాసం రాసినట్టుగా.. ప్రపంచంలో ఏ విషయం మీద మాట్లాడాల్సి వచ్చినా సరే.. షర్మిల దానిని మోడీ వైఫల్యం వద్దకు తీసుకువచ్చి ముడిపెట్టేయగలరు.

ఇప్పుడు అమరావతి రాజధాని పనుల నేపథ్యంలో కూడా ఆమె వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. రాష్ట్రం రాజధాని నిర్మించుకోవడానికి కేంద్రం సహకారం అందించాలనేది నిజమే. కానీ.. 2014-19 మధ్య కాలంలోనే మూడువేల కోట్లకు పైగా నిధులను కేంద్రం అందించింది. వెలగపూడి సచివాలయం, కొంత మేర మౌలికవసతుల పనులు ఆ నిధులతోనే జరిగాయి.

జగన్ సర్కారు వచ్చిన తర్వాత.. అడగందే అమ్మయినా పెట్టదు కదా అనే సిద్ధాంతమే రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ అనుభవంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపూ ఢిల్లీ ప్రదక్షిణలు చేసి.. తన కేసుల గురించి.. వాటి నుంచి రక్షణ గురించి మంతనాలు చేస్తూ వచ్చారు తప్ప.. రాష్ట్రం – రాజధాని గురించి పట్టించుకోలేదు.

ఇప్పుడు కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. అమరావతికి ప్రాణం వచ్చింది. ఈ రాజధాని నగర నిర్మాణం సెల్ఫ్ సస్టయినబుల్ ప్రాజెక్టు ఎలా అవుతుందో.. అక్షరాలా నిరూపిస్తున్నారు. రాజధాని నిర్మాణాలన్నీ పూర్తికావడానికి అవసరమైన నిధులను అప్పులరూపంలో తీసుకురావడానికి కేంద్రం తమ వంతు తోడ్పాటు అందిస్తోంది. ఈ నిర్మాణాలు పూర్తయిన తర్వాత.. మిగిలిన స్థలాలు అమ్మితే అప్పులన్నీ తీరుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఇంత స్వయం సమృద్ధితో కూడిన ప్రాజెక్టు చేపడుతోంటే.. రాజధానిని కేంద్రం కట్టాలంటూ షర్మిల యాగీ చేయడం అర్థరహితంగా ఉంది. రాజధానిలో ప్లాన్ చేస్తున్న రైల్వేస్టేషన్, మెట్రో, రైల్వే ప్రాజెక్టులు.. ఇలాంటి వాటన్నింటికీ కేంద్రం మనస్ఫూర్తిగా సహకరిస్తే సరిపోతుంది కదా.. అనేది ప్రజల మాట. అందుకే షర్మిల మాటలు విన్నవారు.. ఆమె లాజిక్ లేని ఎజెండాతో.. అభాసుపాలవుతున్నారని అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles