వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూన్ 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు రాష్ట్రమంతా కూడా నిరసనలు హోరెత్తించాలని.. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. అయితే జగన్ పిలుపు మీద ప్రజల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే కూటమి పార్టీల్లో తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం అవుతోంది.
జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చిన నిరసన కార్యక్రమాలకు వెన్నుపోటు దినం అని, ప్రజావంచన దినంగా భావించాలని ఆ పార్టీ ప్రకటిస్తోంది. సాధారణంగా పార్టీలు ఇచ్చే హామీలను అయిదేళ్లలోగా నెరవేర్చడం కోసం ప్రజలు వారికి అధికారం కట్టబెడతారు అనే వాస్తవాన్ని విస్మరించి ఒక ఏడాది కూడా గడవకముందే.. అపశకునాలు పలకడం వైసీపీ అలవాటు చేసుకుంది. ఇప్పుడు తాజాగా కూటమి పరిపాలన ‘ఒక్క ఏడాది పూర్తయిన సందర్భంగా’ అనే ముసుగులో ఈ ప్రజావంచన దినం నిర్వహిస్తాం అంటున్నారు. ప్రజలు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు.
చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడినది జూన్ 12న అని, పాలనకు ఏడాది పూర్తి కావడం అంటే ఆరోజు అవుతుంది గానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చరమగీతం పాడుతూ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4 ఎలా అవుతుందని ప్రజలు అడుగుతున్నారు. జూన్ 4 అనేది ప్రజావంచన దినం కాదని, దురహంకార పాలనకు తొలివర్ధంతి అని కూటమి పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం ఆ పాటి అవగాహన కూడా లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎగతాళి చేస్తున్నారు.
ప్రజలు తనను ఓడించిన రోజుకు, కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజుకు తేడా కూడా తెలియని నాయకుడు జగన్ అని ప్రజలు అంటున్నారు. విశ్వసనీయ సమాచారాన్ని బట్టి.. ఏడాది పూర్తయిన సందర్భంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి ముహూర్తం ఎంపిక చేయడంపై తాడేపల్లి ప్యాలెస్ లో తర్జన భర్జనలు జరిగాయి. కొంత మంది సీనియర్ జూన్ 4 కాకుండా.. జూన్ 12న చేద్దామని సూచించినప్పటికీ జగన్ వినలేదని సమాచారం. జూన్ 12 నాటికి తల్లికి వందనం నిధులు కూడా తల్లుల ఖాతాల్లో జమ చేయడం కూడా జరిగిపోతుంది గనుక.. అలా కాకుండా ముందే చేయాలని లేకపోతే.. తాము నిరసనలు తెలియజేయడానికి పాయింట్లేమీ ఉండవని ఆయన అభిప్రాయపడినట్టు సమాచారం.
జగన్ ఏదో తన అవగాహన లేమితో ఆ నిర్ణయం తీసుకున్నారు గానీ.. జూన్ 12లోగా నిధులు వచ్చి పడతాయని ప్రజలకు ఖచ్చితంగా తెలిసిన తర్వాత.. వారం ముందుగా జగన్ నిరసనల పేరుతో డ్రామా నడిపిస్తే మాత్రం ఎవరు పట్టించుకుంటారు? అని అంతా భావిస్తున్నారు.
వంచన దినం’ కాదు.. దురహంకారానికి ‘తొలి వర్ధంతి’!
Thursday, June 19, 2025
