కొత్త లిక్కర్ పాలసీ తయారుచేసి రాష్ట్రప్రభుత్వానికి ఎంతో మేలుచేసేస్తున్నానని, రాష్ట్ర ప్రజలతో మద్యం అలవాటు మాన్పించే గొప్ప కృషి చేసేశానని జగన్మోహన్ రెడ్డి వంద రకాలుగా ఊదరగొట్టారు. కానీ చేసినదెల్లా దోపిడీ మాత్రమే. ఆ దోపిడీలో కూడా రకరకాల కొత్త ఆలోచనలు చేశారు. వినూత్నమైన సృజనాత్మకమైన పద్ధతులు అవలంబించారు. మద్యం ధరలు పెంచి, పెంచిన మొత్తాన్ని మద్యం కంపెనీల నుంచి కాజేయడం అనేదే ఒక పెద్ద గారడీ అయితే.. అంతకు మించిన గారడీలు అనేకం చేశారు. తాజాగా మద్యం కుంభకోణంలో 40 వ నిందితుడిగా పురుషోత్తం వరుణ్ కుమార్ అనే పేరును చేర్చారు సిట్ పోలీసులు. ఈ మేరకు కోర్టుకు మెమో సమర్పించారు. అయితే ఈ పురుషోత్తం కేసులోకి వచ్చిన వైనం గమనిస్తే ఒక కథలాగా ఉంటుంది.
అనగనగా తమిళనాడులో ఎస్ఎన్‌జె సుగర్స్ అనే సంస్థ ఉంది. వారికి పుదుచ్చేరిలో లీలా డిస్టిలరీస్ అనే అనుబంధ సంస్థ కూడా ఉంది. పేరుకు అది డిస్టిలరీస్ తప్ప.. వారికి మద్యం తయారుచేసే మౌలిక వసతులు ఏమీ లేవు. నిజానికి జగనన్న దళానికి అవేమీ అవసరం లేదు. మద్యం కుంభకోణం కీలక కర్త అయిన రాజ్ కెసిరెడ్డి ఈ ఎస్ఎన్‌జె సుగర్స్ కంపెనీ డైరక్టర్లు, ఎగ్జిక్యూటివ్ లను బెదిరించి, లీలా డిస్టిలరీస్ ను తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. వారికి బహుశా నామమాత్రపు వాటాలు కూడా ఆశచూపించి ఉండవచ్చు. సదరు లీలాడిస్టిలరీస్ లో ఏపీ ఆపరేషన్స్ హెడ్ గా పురుషోత్తం ను నియమింపజేశాడు. అతని పేరిట బ్యాంకు ఖాతా తెరిపించి పది కోట్ల వరకు చెక్ పవర్ కూడా ఇప్పించారు.
అక్కడినుంచిచ అసలు డ్రామా మొదలైంది. అసలు మద్యం తయారీనే తెలియని ఈ లీలా డిస్టిలరీస్ కు ఏపీ బెవరేజెస్ సంస్థ భారీగా ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించింది. బిల్లులు చెల్లించడమూ జరిగింది. 2020 జూన్ నుంచి 2024 మార్చి మధ్యలో కేవలం 21 నెలలలో 459 కోట్లరూపాయలు వారికి చెల్లించారు. ఈ లావాదేవీలు సిట్ అధికారులకు అసాధారణంగా కనిపించాయి. ఇంకాస్త లోతుగా దర్యాప్తు చేశారు.
లీలా డిస్టిలరీస్ కు వెళ్లిన సొమ్ము మొత్తం వెంటెవంటనే వేర్వేరు ఖాతాల్లోకి మళ్లిపోయినట్టు గుర్తించారు. అంటే ఈ పురుషోత్తం వరుణ్ కుమార్.. వేర్వేరు డొల్ల కంపెనీల్లో తరలించారన్నమాట. ఈ బాగోతం మొత్తం బయటకు వచ్చిన తరువాత.. పురుషోత్తం వరుణ్ కుమార్ పేరును కూడా నిందితుల జాబితాలోకి చేర్చారు.
అయితే పురుషోత్తం.. గత ఏడాది జులై ఆగస్టు నెలల్లోనే విదేశాలకు పరారైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడని తెలుసుుకని, రప్పించడానికి పోలీసులు ప్రయత్నాలుచేస్తున్నారు. అతని పేర లుకౌట్ నోటీసులు కూడా జారీచేశారు. మొత్తానికి జగన్ దళాలు మద్యం కుంభకోణంలో దోచుకోవడంలో రకరకాల చిన్నెలు ప్రదర్శించినట్టుగా అర్థమవుతోంది.