ప్రజల కష్టాలు సమస్యల పట్ల నాయకులు ఏ విధంగా స్పందిస్తుంటారనే విషయంలో మనలో చాలా మంది ఎవరికి తోచిన వ్యాఖ్యలు వారు చేస్తుంటారు. నాయకులు పట్టించుకోరు అని, తమకు కావాల్సిన వారికి మాత్రమే సాయం చేస్తుంటారని, సాయం చేయడంలో కూడా పార్టీలను బట్టి ప్రవర్తిస్తుంటారని రకరకాల వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. అయితే నారా లోకేష్ స్టయిలే వేరు. రాష్ట్రంలో ఏ మూలనైనా సరే.. ఏ సమస్య అయినా, ఏ విలక్షణ అంశం అయినా సరే, ఏ మంచి పని అయినా సరే.. తన దృష్టికి రావడమే ఆలస్యం.. ఆయన వెంటనే స్పందిస్తారు. మంచి పనిచేసే వారిని భుజం తడతారు, ప్రశంసిస్తారు. సమస్యల్లో ఉండే వారి కష్టాలు తీర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తారు. చాలా సందర్భాల్లో ఆయన తన సొంత సొమ్మునే ఇలాంటి మంచి పనులకు వెచ్చిస్తూ ఉంటారు.
ఒకటీ రెండూ కాదు .. అనేక సందర్భాల్లో నారా లోకేష్ తన దృష్టికి కవచ్చిన ప్రతి విషయంలోనూ వెంటనే సానుకూలంగా స్పందిస్తూ తన ముద్రను చాటుకున్న దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు గమనిస్తే.. కడపజిల్లాలో కాశినాయన ఆశ్రమాన్ని అటవీశాఖ అధికారులు దూకుడు ప్రదర్శించి కూల్చివేయిస్తే.. ఆ విషయం తన దృష్టికి రాగానే లోకేష్ స్పందించారు. కూలిన వాటి స్థానంలో తన సొంత ఖర్చుతో పక్కాగా గతంలో ఉన్న వాటికంటె ఘనంగా కొత్త షెడ్లు వేయించడానికి ఆయన పూనుకున్నారు. కేవలం రోజుల వ్యవధిలోనే ఆ పనులను ప్రారంభింపజేశారు. అలాగే కాశినాయన ఆశ్రమానికి వచ్చే భక్తులకోసం కొన్ని సంవత్సరాలుగా మొరపెట్టుకుంటున్నా బస్సు సౌకర్యం లేదని తెలియగానే.. బస్సు కూడా వేయించారు.
మొన్నటికి మొన్న ఒక ప్రభుత్వ టీచరు తన పిల్లలను ప్రభుత్వ స్కూలులోనే చేర్పించాడని తెలియగానే.. లోకేష్ ఆ టీచరును అభినందిస్తూ ప్రత్యేక ప్రశంసలు పంపారు. అలాంటిదే తాజాగా మరో సంఘటన కూడా జరిగింది.
నెల్లూరులో భిక్షాటన చేసి బతుకుతున్న ఇద్దరు పిల్లలు ‘మాకు చదువు చెప్పించండి సారూ’ అంటూ అధికారులను బతిమాలిన సంఘటన తన దృష్టికి రావడంతో నారాలోకేష్ చలించిపోయారు. ఆయన ఎక్స్ ద్వారా స్పందించారు. ‘‘నెల్లూరు విఆర్ స్కూలు వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు తమకు చదువు చెప్పించాలని కమిషనర్ ను ప్రాధేయపడటం నన్ను కదిలించింది.
ఆ చిన్నారుల విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడి అధికారులను ఆదేశించాను. పేదరికం నుంచి బయటకు తెచ్చే ఒకే ఒక్క సాధనం విద్య. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న కసి, పట్టుదల ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. నెల్లూరులోని ఈ చిన్నారులు తమ కలలను సాకారం చేసుకునేందుకు అన్నివిధాల అండగా నిలుస్తాం’’ అని లోకేష్ పేర్కొన్నారు.
ఈ దృష్టాంతాలన్నీ లోకేష్ ఉదార హృదయానికి మంచితనానికి నిదర్శనాలు అని.. తన దృష్టికి వస్తే చాలు ప్రతి విషయం పట్ల ఆయన ఇంతే సానుకూలంగా స్పందించడం గమనించదగ్గదని ప్రజలు కొనియాడుతున్నారు.