శాసనసభ సమావేశాలు పూర్తయ్యాయి. అసెంబ్లీకి అసలు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానేలేదు. మండలికి మాత్రం తగుదునమ్మా అంటూ వచ్చారు. ప్రతి వ్యవహారానికి అడ్డుపడుతూ నానా యాగీ చేశారు. అర్థం పర్థంలేని ఆందోళనలతో పార్టీ పరువు పోయేలా వ్యవహరించారు. అసెంబ్లీకి పార్టీ హాజరు కాకపోవడం ఒకవైపు, మండలిలో హద్దు మీరి ప్రవర్తించడం మరొకవైపు.. ఈ పరిణామాలన్నీ కలిపి ఆ పార్టీ ఎమ్మెల్సీకే వెగటు పుట్టించినట్టున్నాయి. అందుకే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేశారు.
కైకలూరుకు చెందిన నాయకుడు, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన జయమంగళ వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు తన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకున్నారు. ఈమేరకు రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ మోసేను రాజుకు పంపారు. జయమంగళ వెంకటరమణ గతంలో తెలుగుదేశంలోనే ఉండేవారు. సార్వత్రిక ఎన్నికలకు కొంత కాలం ముందు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత.. ఆయన దాదాపుగా పార్టీకి అంటీముట్టనట్టుగానే ఉన్నారు. తాజాగా ఏకంగా రాజీనామా చేసేశారు.
అయితే తనను రాజీనామాకు ప్రేరేపించిన కారణాలు ఏమిటి అనేది ఆయన ఇంకా వెల్లడించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ మళ్లీ బతికి బట్టకడుతుందనే నమ్మకం కార్యకర్తల్లో కలగకపోవడం, జగన్మోహన్ రెడ్డి పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమాలు వారిలో నమ్మకాన్ని కలిగించకపోవడం వల్ల అనేక మంది నాయకులు ఇప్పటికే వైసీపీని వీడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. శాసనసభ సమావేశాలు కూడా జరిగిన తర్వాత.. జయమంగళ వెంకటరమణ రాజీనామా చేయడం అంటే.. సమావేశాల సందర్భంగా వైసీపీ వ్యవహరించిన తీరుతో విసిగిపోయి ఉంటారని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు కూడా కొందరు రాజీనామాలు చేసి ఉండగా.. అవి మండలి ఛైర్మన్ ఆమోదం పొందవలసి ఉంది.
ఇవన్నీ ఒక ఎత్తు కాగా, అదానీతో జగన్మోహన్ రెడ్డి అక్రమ లంచాల బంధం గురించి అమెరికాలో కేసులు నమోదు కావడం.. 1750 కోట్ల రూపాయల అవినీతి బాగోతం పార్టీ పరువును బజార్లో పెట్టేసిన నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ తీరుతో విసిగిపోయి ఉన్న అనేక మంది నాయకులు.. ఈ సందర్భంగా రాజీనామాలు చేయదలచుకుంటున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
వెగటు పుట్టిందేమో : వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా!
Saturday, December 7, 2024