భారతీయ జనతా పార్టీ కి ఏపీ కొత్త సారథిగా మాధవ్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన తన సారథ్యం ఎలా ఉండబోతుందో చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. ఒక చేతిలో బిజెపి జెండా మరో చేతిలో కూటమి ఎజెండా తో ముందుకు సాగుతానని ఆయన చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. కనీసం మరో పదిహేనేళ్లపాటూ కూటమి సమైక్యంగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్న తరుణంలో.. ఈ మాటలకు ప్రాధాన్యం ఎక్కువ. అదే సమయంలో మాధవ్ నాయకత్వంపై భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అన్నింటినీ మించి రాష్ట్రంలో ఏడాది కాలంగా పెండింగులో ఉన్న నామినేటెడ్ పదువల పందేరం త్వరగా ఒక కొలిక్కి వస్తుందని అంతా ఆశిస్తున్నారు.
చంద్రబాబునాయుడు నామినేటెడ్ పదవుల విషయంలో కీలకమైన చాలా పదవులను ఇప్పటికే భర్తీ చేశారు. ఎన్నికల్లో పోటీచేసిన దామాషాలోనే కూటమి పార్టీల మధ్యఅన్ని రకాల పదవుల పంపకాలు ఉంటాయని స్పష్టం చేసిన చంద్రబాబు.. ఆ సూత్రం మేరకే జనసేనకు, బిజెపి కి కూడా ప్రతి నామినేటెడ్ బాడీలోను వాటాలు పంచుతున్నారు. అయితే ఇంకా నియామకం జరగని పదవులు అనేకం ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే.. కొన్ని వందల ఆలయాలకు సంబంధించిన పాలకమండలుల నియామకం ఇంకా జరగనే లేదు. టీటీడీ తప్ప కనీసం ఇతర ప్రధాన ఆలయాలు విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర ఆలయాలకు కూడా పాలకమండలులను నియమించలేదు. ఇలాంటి చిన్నా పెద్దా కలిపి వందకు పైగా ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీ నాయకులు సాధారణంగా హిందూత్వ ఎజెండాతో ఉండే కార్యకర్తలు గనుక.. ఆలయ పాలక మండలులలో అవకాశం కోరుకునే వారు ఎక్కువగానే ఉంటారు. అయితే చాలా పాలక మండలులను ఫైనలైజ్ చేయడానికి కొందరినుంచి ఇంకా ప్రతిపాదనలు రాకపోవడమే కారణం అని చంద్రబాబు గతంలో కూడా చెప్పారు. ఈ సమస్యలో బిజెపిలో కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. బిజెపి తరఫు కూడా.. ఏయే ఆలయ పాలకమండలులకు తమ పార్టీ తరఫున సిఫారసు చేస్తున్న వారి పేర్ల జాబితాను ఫైనలైజ్ చేసి చంద్రబాబుకు ఇవ్వడం జరగలేదనే వాదన ఉంది. పురందేశ్వరి.. తన పదవీకాలం అయిపోయింది గనుక.. కొత్త సారథి ఎంపిక అయ్యాక ఆ సంగతి చూద్దాం అని వాయిదా వేసినట్టు కూడా చెబుతుంటారు. మొత్తానికి ఇప్పుడు కొత్త సారథి వచ్చాడు గనుక.. పార్టీ తరఫున సిపారసుల జాబితాలను త్వరగా పంపేయాలని కార్యకర్తలు మాధవ్ మీద ఆశలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడే ఫైనలైజ్ చేస్తే కనీసం రెండు దఫాలు పాలకమండలులకు అవకాశం ఉంటుందని.. ఇంకాజాప్యం జరిగితే అవకాశాలు కుంచించుకుపోతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.