లోకేష్ వినయం, ఔదార్యం.. వారంతా వెరీ హేపీ!

Friday, March 28, 2025

తెలిసో తెలియకో ప్రభుత్వ యంత్రాగంలో ఒకరు తప్పు చేయవచ్చు.. అది తప్పు అని గ్రహించినప్పుడు.. దానిని దిద్దుకోవడానికి మరొకరు ప్రయత్నిస్తే ఆ యంత్రాంగం పాలన భేషుగ్గా ఉంటుంది. అలా చేయకుండా, జరిగిపోయింది.. తప్పు ఒప్పుకుంటే తమకు పరువు తక్కువ అని భావిస్తూ మరింత మొండిగా వ్యవహరిస్తే . మరింతగా పరువు పోతుందే తప్ప ఏమీ ఒరగదు. కానీ.. ఇలాంటి సందర్భాల్లో ఎంత వినయంగా, ఔదార్యంతో స్పందించవచ్చునో.. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిరూపించుకున్నారు. అందుకే ఆయన ఇప్పుడు కడప జిల్లాలోనే అనేకమంది దృష్టిలో హీరోగా, అద్భుతమైన మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

బద్వేలు నియోజకవర్గం పరిధిలోని నల్లమల అడవుల్లో కాశినాయన ఆశ్రమం ఉంటుంది. కాశినాయన ఆశ్రమానికి స్థానికంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కాశినాయనను అవధూతగా, దైవస్వరూపంగా ఎంచి ఆరాధించే భక్తులు లక్షల సంఖ్యలో ఉంటారు. అడవుల్లో ఉండే జ్యోతిక్షేత్రం, కాశినాయన ఆశ్రమాన్ని సందర్శించేందుకు నిత్యం ఎంతో మంది భక్తులు ఎన్నో కష్టనష్టాలకోర్చి అక్కడకు వస్తుంటారు. ఆశ్రమానికి ఏ రోజు ఎంతమంది వచ్చినా.. ఏ సమయంలో వచ్చినా కూడా లేదనకుండా నిరతాన్నదానం జరుగుతూనే ఉంటుంది. సమీప గ్రామాల్లోని రైతులు తమ పంట దిగుబడులను, కూరగాయలను దినుసులను అన్నింటినీ అన్నదానం నిమిత్తం తెచ్చి విరాళంగా ఇస్తుంటారు. అక్కడ అంతా నిస్వార్థంగా నడుస్తూ ఉంటుంది. ప్రచార కాంక్ష కూడా కనిపించదు.
అలాంటి కాశినాయన ఆశ్రమంలోని అన్నదానం షెడ్లనుఇటీవల అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం, అటవీ ప్రాంతంలో ఉన్నాయని ఆరోపించడం చాలా పెద్ద వివాదం అయింది. తిరుమల, శబరిమల లాంటి ప్రఖ్యాత క్షేత్రాలతో సహా అన్నీ అటవీ ప్రాంతాల్లోనే ఉండగా.. కాశినాయన ఆశ్రమం షెడ్లను కూల్చివేయడం పట్ల భక్తుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అయితే ఈవిషయంలో ఐటీ మంత్రి నారా లోకేష్ అపూర్వంగా స్పందించారు.

ఆశ్రమ నిర్వాహకులు జీరయ్య స్వామితో మాట్లాడిన లోకేష్.. అటవీ అధికారులు పొరబాటు చేశారని, అందుకు ప్రభుత్వాన్ని క్షమించాలని కోరి తమ వినయాన్ని చాటుకున్నారు. ప్రభుత్వానికి తెలియకుండా అధికారులు ఈ పనిచేసినట్టు వివరణ ఇచ్చుకున్నారు. ముమ్మాటికీ తప్పేనని.. మన్నించాలని అడిగారు. కూలిన షెడ్లను పూర్తిగా తన సొంత నిధులతో తిరిగి నిర్మింపజేస్తానంటూ లోకేష్ ఆశ్రమ నిర్వాహకులకు హామీ ఇచ్చారు. అలాగే ఆశ్రమం, జ్యోతిక్షేత్రం వద్దకు రావడానికి ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పించే ప్రయత్నం కూడా చేస్తానన్నారు.

మొత్తానికి ఈ చర్యతో.. లోకేష్ తన వినయవిధేయతలను, అలాగే.. తన ఔదార్యాన్ని ధార్మిక గుణాన్ని కూడా చాటుకున్నట్లు అయిందని అంతా కొనియాడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles