వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డి ఎట్టకేలకు అరెస్టు అయ్యారు. నిజానికి ఆయన 55 రోజులుగా కలుగులు మారుస్తూ రకరకాల ప్రదేశాలలో దొంగచాటుగా తలదాచుకుంటూ తిరుగుతున్నారు. అయితే అనేక మార్గాల్లో ఆయన మీద నిఘా పెట్టినపోలీసులు ఎట్టకేలకు కర్నాటక లోని ఒక గ్రామంలో రిసార్టుల్లో ఉండగా వలపన్ని పట్టుకుని అరెస్టు చేశారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, భారీగా పేలుడుపదార్థాల వినియోగం, ఎస్సీ ఎస్టీలను బెదిరించిన కేసులు ఆయన మీద ఉన్నాయి. ముందస్తు బెయిలు కోసం అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఊరట దక్కని కాకాణి గోవర్దనరెడ్డికి కోర్టు రిమాండు విధించే అవకాశం ఉంది. అయితే ఆయన ఇప్పట్లో బయటకు రాకుండా.. ఇంకా అనేక కేసుల్లో పీటీ వారంట్లను పోలీసులు సిద్ధం చేస్తున్న్టట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ పరిస్థితే కాకాణికి కూడా తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు.
కాకాణి గోవర్దన రెడ్డి మీద అనేక కేసులు ఉన్నాయి. పది కోట్ల వరకు జరిమానాలు విధించి అక్రమ క్వార్ట్జ్ తవ్వకాల కేసు మాత్రమే కాదు. కోర్టునుంచి ఫైల్స్ మాయం అయిన కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి. పోలీసులను బట్టలూడదీయించి కొడతానంటూ ఆయన ప్రగల్భాలు పలికిన కేసులు కూడా ఉన్నాయి. అక్రమార్జనలు, ఇసుక, మట్టి దందాలు తదితర కేసులు కూడా ఉన్నాయి. ప్రధానంగా క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసు ముందుకు నడవడంతో ఆయన పరారయ్యారు. 55 రోజులుగా పరారీలోనే ఉన్నారు. పోలీసులు బృందాలుగా విడిపోయి వెతుకుతున్నప్పటికీ ఆయన ఆచూకీ తెలియలేదు. మరోవైపు హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ముందస్తు బెయిలు పిటిషన్లునడిపారు. అక్కడ ఊరట దక్కలేదు. చివరికి అరెస్టు అయ్యారు.
వల్లభనేని వంశీ మీద కూడా అనేక కేసులు ఉండడంతో.. ఆయన వరుసగా జైల్లోనే గడుపుతున్నారు. ఒకటి రెండు కేసుల్లో బెయిలు వచ్చినప్పటికీ.. మరి కొన్ని కేసులు వచ్చి పడుతున్నాయి. ఒక కేసు సంగతి కొలిక్కి వస్తుండగానే.. మరో కేసులో పీటీ వారంటు ద్వారా విచారణ ఎదుర్కొని మళ్లీ రిమాండుకు వెళుతున్నారు. ఇప్పట్లో ఆయన బయటకు రావడం కష్టమని ఆయన మీద అన్ని కేసులున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాకాణి గోవర్దన రెడ్డి పరిస్థితి కూడా అంతే అని.. ఆయన కూడా బయటకు రావడం జరగదని, ఒకదాని తర్వాత ఒకటి పీటీ వారంట్లతో కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
వంశీ లాగానేనా? కాకాణిపై సిద్ధమవుతున్న పీటీ వారంట్లు!
Thursday, June 19, 2025
