సాక్షి బంధానికి గుడ్ బై కొట్టనున్న కొమ్మినేని!

Friday, July 11, 2025

దాదాపు యాభయ్యేళ్ల పాత్రికేయ జీవితంలో జైలు పాలయ్యేలా తన పరిస్థితిని దిగజార్చిన సాక్షి మీడియా గ్రూపుతో ఉన్న బంధాన్ని వెటరన్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు తెంచుకోనున్నారా? ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలు నుంచి బెయిలు మీద విడుదల అయిన కొమ్మినేని, త్వరలోనే సాక్షిలో చేస్తున్న యాంకర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. తన శేషజీవితాన్ని ప్రశాతంగా గడపాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ప్రశాంతంగా లేని ప్రస్తుత పరిస్థితుల్లో అదే ఉత్తమం అని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జర్నలిస్టుగా కార్యక్రమాలను కూడా రాజకీయ భావజాలానికి దూకుడుకు అనుగుణంగా నిర్వహించేలా సంస్థ ఒత్తిడి తెస్తుండడంతో ఆయన ఇక సాక్షికి గుడ్ బై కొట్టనున్నట్టుగా తెలుస్తోంది.

అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలు చేసిన అంశానికి సంబంధించి ఆ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అయ్యారు. తన కార్యక్రమంలో అలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు వాటిని ఆపకపోగా, ప్రోత్సహించేలా వెకిలినవ్వులతో కొనసాగించడం అనేవి ఆయన మీద ఉన్న ఆరోపణలు. కంభంపాటి శిరీష పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసుకింద ఆయన అరెస్టు అయ్యారు. కింది కోర్టు తిరస్కరించినప్పటికీ.. సుప్రీంకు వెళ్లిన తర్వాత ఆయన ఊరట లభించింది. మొత్తానికి సోమవారం సాయంత్రం బెయిలుమీద విడుదల అయ్యారు.

అయితే.. ప్రస్తుత జర్నలిజంలో సీనియర్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి,  ఎన్ టీవీ, టీవీ 5 సంస్థల్లో కూడా పనిచేశారు. ఈనాడుతో ఆయనకు సుదీర్ఘకాల అనుబంధం ఉంది. అయితే గతంలో పనిచేసిన ఏ సంస్థలో కూడా రాజకీయ భావజాలాల పరంగా తన మీద ఇంత తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉండేది కాదని కొమ్మినేని ఇప్పుడు ఆత్మసమీక్షలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. యాజమాన్యాల రాజకీయ భావజాలాలకు అనుగుణంగా పనిచేయడం అనేది ఎవ్వరికైనా తప్పదు. అయితే.. అందులో కూడా సాక్షిలో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్టుగా కొమ్మినేని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కొమ్మినేని శ్రీనివాసరావుకు ఆల్రెడీ డెబ్భయ్యేళ్లు నిండుతున్నాయి. ఆర్థికంగా కూడా సమృద్ధిగానే ఉన్నారు. ఇలాంటి సమయంలో.. ఒక పార్టీకి కొమ్ము కాసేలా.. జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం తన జీవితాన్ని ఎందుకు పణంగా పెట్టాలని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరో నాలుగేళ్లపాటు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వమే ఉంటుంది. ఈ నాలుగేళ్లలో కూడా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనతో అనేక తప్పుడు వ్యాఖ్యలు చేయించేందుకు యాజమాన్యం ఒత్తిడిచేస్తూనే ఉంటుంది. ఇప్పుడు జగన్ పార్టీని నడుపుతున్న తీరు గమనిస్తే 2029 ఎన్నికల్లోనైనా వైసీపీ నెగ్గుతుందనే ఆశ కలగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరో పదేళ్ల జీవితాన్ని ఏ ఆశతో జగన్ మీడియాకు పణంగా పెట్టాలి అని కొమ్మినేని భావిస్తున్నట్టు సమాచారం.

అందుకే గుంటూరు జిల్లా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత.. అక్కడ మీడియాతో మాట్లాడాల్సిందిగా మాజీ మంత్రి అంబటి రాంబాబు సూచించినా కూడా.. కొమ్మినేని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అడపాదడపా కేఎస్సార్ లైవ్ షో కార్యక్రమాలకు హాజరు అవుతూ.. నెమ్మదిగా ఆరోగ్య కారణాలు చూపించి.. ఎవరినీ నొప్పించకుండా ఉద్యోగం నుంచి తప్పుకోవాలని కొమ్మినేని భావిస్తున్నారని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles