కెసిఆర్.. ఇక కేవలం మార్గదర్శనం మాత్రమే!

Sunday, October 6, 2024

తెలంగాణ జాతిపితగా గులాబీ పార్టీ నాయకులు ప్రేమగా పిలుచుకునే కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్రియాశీల రాజకీయాలకు అప్రకటిత వీడుకోలు చెప్పబోతున్నారా? రాబోయే రోజుల్లో ఆయన ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుంది కానీ మునుపటిలాగా పార్టీని ముందుకు నడిపించే ఉద్యమాలు, సభలు, పోరాటాలతో ప్రభుత్వం మీద దాడి సాగించే తీరు ఇకపై ఉండబోదా? పార్టీ వర్గాల ద్వారా అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో అధికారం దూరం అయిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యం కూడా దెబ్బతింది. చాలా కాలం పాటు ఆయన ఇంటికే పరిమితమై ఉన్నారు. అనివార్యమైన పరిస్థితులలో కొన్ని ప్రజా కార్యక్రమాలలోకి వచ్చారు. ఈలోగా పార్లమెంటు ఎన్నికలు వచ్చి ప్రచారంలో తిరగాల్సి వచ్చింది. కూతురు కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ ప్రతినిధులు అరెస్టు చేసిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలావరకు సైలెంట్ గా మాత్రమే ఉన్నారు. న్యాయవాదులతో మాట్లాడడం, కల్వకుంట్ల కవితకు బెయిలు తీసుకురావడానికి సంబంధించిన బాధ్యతలు అన్నీ కూడా ఆయన కేటీఆర్, హరీష్ రావులకు అప్పగించారు. ఇక మీదట కూడా పార్టీకి దిశా నిర్దేశం చేసే బాధ్యతలలో మాత్రమే ఉంటానని ఆయన అన్యాపదేశంగా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది.

కల్వకుంట్ల కవిత బెయిలు మీద విడుదలై బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లి తండ్రిని కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి కూడా గురి అయినట్లు వార్తలు వచ్చాయి. పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో దారుణమైన పరాభవం ఒక ఎత్తు అయితే.. పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం మంటగలిసిపోయి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోవడం, దాదాపు పది సీట్లలో పార్టీకి చెందిన అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం లాంటి పరిస్థితులలో పార్టీ పునర్నిర్మాణం సమర్థంగా జరగాలంటే అందుకు అవసరమైన సమయం వెచ్చించే ఓపికక  కేసీఆర్ కు లేదని సమాచారం.

ఈ నేపథ్యంలో పార్టీ కార్యకలాపాల భారాన్ని నెమ్మదిగా తగ్గించుకోవాలనుకుంటున్నారట. పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే లక్ష్యంతో 2029 వరకు మార్గదర్శనం చేయాలని, ప్రస్తుత కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని ఆయన నిర్దేశిస్తున్నారు. కెసిఆర్ కేవలం గదిలో కూర్చుని మాస్టర్ మైండ్ గా వర్తమాన పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ సలహాలు ఇస్తూ గడుపుతారని తెలుస్తోంది. భవిష్యత్ వారసుడిగా కేటీఆర్ ను ప్రొజెక్ట్ చేయడానికి ఇది మంచి అవకాశం గా కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles