వారెవ్వా.. ఎంత మార్పు. తాను అధికారంలో ఉన్న అయిదేళ్ల కాలం పాటు విచ్చలవిడిగా వ్యవహరిస్తూ.. కేవలం తన ‘రెడ్డి’ కులం వారిని మాత్రమే నమ్ముతూ, వారిని మాత్రమే ప్రోత్సహిస్తూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుఉ ‘రెడ్డి’ అనే పదం పట్ల భయపడుతున్నారా? ‘రెడ్డి’ అనే పదాన్ని జాగ్రత్తగా ఎడిట్ చేయకుంటే.. తనకు రాజకీయ మనుగడ కూడా ఉండదని భయపడుతున్నారా? రెడ్లకు ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం లేదు అనే సంకేతాలను తన కరపత్రిక ద్వారా ప్రజల్లోకి పంపడానికి ఆయన ప్రయత్నిస్తున్నారా? అన్ని కులాలను జగన్ సమానంగా ఆదరిస్తున్నారనే గుర్తింపుకోసం ఆరాటపడుతున్నారా? అంటే అవుననే అభిప్రాయమే మనకు కలుగుతోంది. ఎందుకంటే.. ఆయన సొంత పత్రిక, ఆయన మనోగతానికి, ఆలోచన సరళికి అద్దం పడుతూ ఉండే పత్రిక ‘సాక్షి’ తాజాగా తమ సొంత పార్టీలోని కొందరు కీలక నాయకుల పేర్లను ప్రస్తావిస్తున్న సందర్భంలో వారి పేరు చివర ఉండే ‘రెడ్డి’ అనే పదాన్ని ‘ఎడిట్’ చేసేస్తోంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కూతురు గ్రాడ్యుయేషన్ డే సెరమనీ పేరు మీద కొన్ని వారాల పాటు లండన్ లో, విదేశాలలో పర్యటించి వచ్చిన సంగతి తెలిసిందే. సీబీఐ కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. కోర్టు ఉత్తర్వుల ప్రకారం గడువు ముగిసే సమయానికి తిరిగి బెంగుళూరు ప్యాలెస్ కు చేరుకున్నారు. తాజాగా బెంగుళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు కూడా వచ్చారు అక్కడ పార్టీలోని కీలక నాయకులతో సమావేశం అయ్యారు. జగన్ సమావేశం ఎలా ఎవరితో జరిగినప్పటికీ.. ఆయన ఏం తలచుకుంటే అలా మాత్రమే ఆయన సొంత పత్రికలో ప్రచురితం అవుతుందనే సంగతి అందరికీ తెలుసు. ఆయన ప్రధానంగా నలుగురు కీలక నాయకులతో సమావేశమైనట్టుగా సాక్షి పత్రిక ప్రచురించింది. ఇందులో పెద్ద విశేషం లేదు. ఆ నలుగురూ- బొత్స సత్యనారాయణ, సజ్జల రామక్రిష్ణా రెడ్డి, మేరుగు నాగార్జున, జోగి రమేష్ అని పేర్కొన్నారు. సాధారణంనగా తన కులానికి చెందిన ఆంతరంగిక నాయకులతో మాత్రమే మీటింగులు పెట్టుకుని నిర్ణయాలు తీసుకుని వాటిని అందరూ ఉండే మీటింగుల్లో వెల్లడిస్తూ ఉండే జగన్ ఇలా కులాల సమతూకంపై దృష్టి పెట్టి నాయకులతో సమావేశం కావడం.. ఆయన మారినట్టుగా కనిపించే ప్రయత్నం కావొచ్చు. ఆ సంగతి పక్కన పెట్టినప్పటికీ.. సాక్షి పత్రిక ఆ వార్తను ప్రచురించడంలో చిత్రంగా వ్యవహరించింది.
సజ్జల రామక్రిష్ణా రెడ్ది పేరును ‘రెడ్డి’ అనే పదమే లేకుండా వేశారు. ‘‘బొత్స సత్యనారాయణ, సజ్జల రామక్రిష్ణ, మేరుగు నాగార్జున, జోగి రమేష్ పాల్గొన్నారు’’ అని రాశారు. రెడ్డి అనే పదం లేకపోతే అసలు గుర్తించడమే సాధ్యం కానంతగా.. దానితో పాటు పాపులర్ అయిన వ్యక్తి సజ్జల! అలాంటి సజ్జల పేరును కేవలం ‘రామక్రిష్ణ’ అని రాయడం చిత్రమే. కొన్నాళ్లు పోతే అదే పత్రికలో.. ఆయన పేరు రాయాల్సి వస్తే ‘‘ఎస్.రామక్రిష్ణ’’ అని రాస్తారేమో కూడా తెలియదు. అయితే.. ఇలా ‘రెడ్డి’ పదాన్ని ప్రచురించే పేర్లలో తొలగించడం ద్వారా.. తానేమీ సొంత కులానికి పెద్దపీట వేయడం లేదు అనే భావన చాటుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారేమో. కానీ కులం బుద్ధులను తొలగించాల్సిందే.. ప్రచురించే పేర్లలోంచి కాదు.. బుద్ధుల్లోంచి అని ప్రజలు అనుకుంటున్నారు.
రెడ్డి’కి కత్తెర వేస్తున్న జగన్ పత్రిక
Sunday, February 16, 2025
