జగన్ నాటకాలు సాగవు మద్యం సొమ్ము కూడా దొరికింది

Friday, November 14, 2025

అసలు లేని స్కాం ను చంద్రబాబు నాయుడు సృష్టిస్తున్నారు. జరగని స్కాం గురించి కేసులు నమోదు చేసి తమ పార్టీ వారిని కక్షపూరితంగా అరెస్టు చేస్తున్నారు. ఇన్నాళ్లపాటూ  ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రకరకాల నీతి వాక్యాలు చెబుతూ వచ్చారు. అయితే ఆయన పప్పులు కలకాలం ఉడికేలా లేదు. ఎందుకంటే మద్యం కుంభకోణంలో డిస్టిలరీల నుంచి వసూలు చేసిన వేల కోట్ల రూపాయలలో కొంత మొత్తం నగదు రూపంలో పోలీసులకు చిక్కింది. అక్రమార్జనల డబ్బును దాచి ఉంచిన చోటునుంచి స్వాధీనం చేసుకున్నారు.  ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాదు సమీపంలో పోలీసులు దాడులు నిర్వహించి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాదు సమీపం శంషాబాద్ మండలం కాచారం అనే ఒక గ్రామం పరిధిలో ఒక ఫామ్ హౌస్ లో రహస్యంగా దాచిన సొమ్మును ఏపీ సీట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వసూళ్ల నెట్ వర్క్ కింగ్ పిన్‌గా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి ప్రధాన అనుచరులలో ఒకరైన వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫామ్ హౌస్ లో మొత్తం 12 పెట్టెలలో ఉన్న 11 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వసూళ్ల నెట్వర్క్ కింగ్ పిన్ అయిన రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకే డబ్బును అక్కడ దాచినట్లుగా వారు వెల్లడించారు. 2024 జూన్ నెలలోనే అక్కడికి తరలించినట్లుగా తెలుస్తోంది.

అసలు జరగని స్కాం గురించి తప్పుడు కేసులు పెట్టి తమ వారిని అరెస్టు చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన అనుచర గణాలు రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. తాజాగా నగదు కూడా దొరికింది. ఇన్నాళ్లపాటు ఈ కుంభకోణం దర్యాప్తును విమర్శిస్తూ వచ్చిన వారు.. ఒక్క ఆధారమైనా లభించిందా ? ఒక్క రూపాయి అయినా దొరికిందా? అంటూ తెగ నీలిగారు. ఇప్పుడు పక్కా సమాచారంతో ఏకంగా 11 కోట్ల రూపాయలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం కీలక పరిణామంగా పలువురు భావిస్తున్నారు. దీంతో వైసిపి దళాలు తప్పించుకోవడం సాధ్యం కాదని అంతిమ లబ్ధిదారు ఎవరో బయటకు రాబట్టడం ఒక్కటే మిగిలి ఉన్న పరిణామం అని పలువురు అంచనా వేస్తున్నారు.

డబ్బు దాచి ఉంచిన కాచారం ఫాం హౌస్ ఎవరిది? అక్కడ డబ్బు దాచడంలో ఇంకా ఎవరెవరికి పాత్ర ఉంది? వంటి వివరాలు కూడా బయటకు రావాల్సి ఉంది. ఆ ఫాంహౌస్ వైసీపీ నాయకులకు గానీ, లేదా ప్రతి విషయంలోనూ వారికి సహకరిస్తూ వస్తున్న భారాస నాయకులకు గానీ సంబంధించినది అయి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. మొత్తానికి ఇన్నాళ్లుగా ఏ ఆధారాలకోసమైతే జగన్ దళాలు సవాళ్లు విసిరాయో అవి కూడా దొరికినట్టే. ఇక కొత్తగా ఎవరి పేర్లు నిందితుల జాబితాలోకి చేరుతాయో.. ఎవరెవరిని అరెస్టు చేస్తారో వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles