వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా పార్టీని గాలికి వదిలేసి.. నిర్లక్ష్యంగా నిర్వహించే నాయకుడు వర్తమాన రాజకీయ చరిత్రలో మరొకరు ఉండకపోవచ్చు. పార్టీ తరఫున ఉద్యమాలు చేయాలని, పోరాటాలు చేయాలని ఆయన పిలుపు ఇస్తారు. ఆ ఉద్యమాలలో తాను పాల్గొనరు. పార్టీ తరఫున రాష్ట్రమంతా హోరెత్తించేయాలని పిలుపు ఇచ్చి.. తాను మాత్రం పారిపోయి ఎంచక్కా బెంగుళూరు ప్యాలెస్ లో కూర్చుంటారు. ఆయన పార్టీ మీద చూపిస్తున్న శ్రద్ధకు తగ్గట్టుగానే.. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా తూతూమంత్రంగా మొక్కుబడిగా వాటిని నడిపిస్తున్నారు. మొత్తంగా పార్టీ కుదేలైపోతోంది. దీనికి మరో ఉదాహరణ ఇప్పుడు జగన్ పిలుపు ఇచ్చిన ‘చంద్రబాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ అనే కార్యక్రమం.
ఈ కార్యక్రమం కింద పార్టీ నాయకులు రాష్ట్రంలో ఇంటింటికీ తిరగాలని.. మేనిఫెస్టో హామీలను అమలు చేయకుండా చంద్రబాబునాయుడు ఏరకంగా ప్రజలను మోసం చేస్తున్నారో చెప్పాలని జగన్ పిలుపు ఇచ్చారు. ఒకవైపు ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ పేరుతో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఆ పార్టీ తరఫున సీఎం, డిప్యూటీసీఎం సహా అందరూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా స్థానిక నాయకులు కూడా ముమ్మరంగా తిరుగుతున్నారు. దానికి పోటీగా ఇదే సమయంలో వైఎస్సార్ సీపీ నాయకుల్ని కూడా ఇంటింటికి తిరగాలని జగన్ పురమాయిస్తున్నారు.
ఇంటింటికీ తిరగడంలో రెండు పార్టీల నాయకులు పరస్పరం తారసపడాలని, ఘర్షణలు రేగాలని జగన్ కోరిక. ఆయనకు నిజంగానే ప్రజల వద్దకు వెళ్లి చంద్రబాబు మోసాలను చెప్పాలని ఉంటే.. సరిగ్గా ఈ సమయాన్నే ఎందుకు ఎంచుకోవాలి? కూటమి కార్యక్రమం పూర్తయిన తర్వాత వారికి లభించిన స్పందనను కూడా చూసుకుని అప్పుడు ఇంటింటికీ వెళ్లి నిందలు వేయవచ్చు గదా.. అంటే దానికి జవాబు లేదు. అయితే ఇలా కార్యక్రమానికి పిలుపిచ్చిన జగన్ తాను మాత్రం బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు.
నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు, కార్యకర్తలకు ఇంటింటికీ తిరిగే ఓపిక లేదు. వారు నియోజకవర్గ స్థాయిలో ఒక మీటింగు పెట్టుకుని.. జగన్ ప్రవచించిన నినాదాన్ని వల్లెవేస్తూ.. ప్రభుత్వం మీద నిందలు వేసి ప్రసంగాలు చేసి అక్కడితో మమ అనిపిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అంటే వారి కార్యకర్తలు మాత్రమే వస్తారు. వారి ఎదుట చంద్రబాబును ఎంత తిట్టినా సరే.. కొత్తగా వచ్చే లాభం ఉండదు. అలాగని.. ఇల్లిల్లూ తిరగడానికి ఆ పార్టీ నాయకులకు ధైర్యం లేదు. తిరిగితే.. ప్రజలు తమను ఎన్ని ప్రశ్నలు అడుగుతారో అని వారికి భయం. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పిలుపు ఇచ్చిన ప్రోగ్రాం తుస్సుమంటోంది. పార్టీ వారు మీటింగులు పెడుతున్నారు తప్ప.. ప్రజల్లోకి వెళ్లడానికి సాహసించడం లేదు.