శాసనసభకు హాజరు కాకుండా బయట కూర్చుని శాపనార్థాలు పెడుతూ గడిపేస్తే.. ప్రజలు తనను హీరో కింద చూస్తారనే భ్రమల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నారు. తాజాగా అరవై రోజుల పాటు శాసనసభకు రాకపోతే, శాసనసభ్యత్వం రద్దవుతుందనే రాజ్యాంగంలోని అంశం తెరమీదకు వచ్చిన తర్వాత కూడా ఆయన మీడియా సమావేశాల్లో ప్రగల్భాలు పలుకుతున్నారు.
తనకు ప్రతిపక్ష నేత హోదా దక్కించుకోగల బలాన్ని ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ.. హోదా ఇస్తే తప్ప సభలో అడుగుపెట్టను అనే అర్థంపర్థం లేని డిమాండుతో తనలోని పలాయనవాదానికి ముసుగువేసుకుని రాజకీయం చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్.. ఎలాంటి అబద్ధాలతో మీడియాను, ప్రజలను కూడా తప్పుదారి పట్టిస్తున్నారో డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు విపులంగా చెబుతున్నారు.
అరవై రోజుల పాటు శాసనసభకు హాజరు కాకపోతే.. సహేతుక కారణం పేర్కొంటూ సెలవుచీటీ కూడా పెట్టకపోతే.. ఆ ఎమ్మెల్యే సీటు ఖాళీగా ఉన్నట్టుగా ప్రకటించడానికి స్పీకరుకు అధికారం ఉంటుందనే రాజ్యాంగంలోని 190(4) వ అధికరణం గురించి వెలుగులోకి తెచ్చింది రఘురామక్రిష్ణరాజే. ఆయన ఆ సంగతి బయటపెట్టిన నాటినుంచి జగన్మోహన్ రెడ్డికి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టుగా పరిస్థితులు పరిణమిస్తున్నాయి.
ఆయన ఏ అంశం మీద ప్రెస్ మీట్ పెట్టడానికి పూనుకున్నా సరే.. వచ్చిన మీడియా వాళ్లు.. ఏదో ఒకరకంగా.. ఈ గైర్హాజరీ దగ్గరకు చర్చను లాక్కెళుతున్నారు. అసలే మీడియా మీట్ లో ప్రశ్నలు అంటే తడబడిపోయే జగన్ తప్పనిసరి పరిస్థితుల్లో వారికి జవాబు ఇవ్వాల్సి వస్తోంది. వారు రాజ్యాంగంలోని అంశం గురించి అడిగితే.. జగన్ సూటిగా జవాబు చెప్పకుండా.. ముందు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పండి.. స్పీకరుకు హైకోర్టు సమన్లు పంపింది.. ముందు ఆ సమన్లకు జవాబు ఇవ్వమని చెప్పండి.. అంటూ తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారు.
తాజాగా తన మీద గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసు విషయంలో గుంటూరు కోర్టుకు హాజరైన డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని.. కోర్టు స్పీకరుకు సమన్లు ఇవ్వడమే జరగలేదని అంటున్నారు. పదిశాతం సభ్యులు లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని గుర్తుచేస్తున్నారు.
ఈ వ్యవహారం చూడబోతే.. గుడ్డకాల్చి స్పీకరు మొహాన పడేస్తే.. ఆ మసిని వారే కడుక్కుంటారు లే అనే కుయుక్తితో జగన్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే.. సాధారణంగా ఏ చిన్న ఆధారం ఉన్నా సరే.. చేతిలో కాగితాలు పెట్టుకుని జగన్ మాట్లాడుతూ ఉంటారు. స్పీకరుకు కోర్టు సమన్లు ఇచ్చిన మాట వాస్తవమే అయితే గనుక.. తనకు ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టు ద్వారా పోరాడుతున్న జగన్.. ఆ సమన్ల కాపీని మీడియా ముందు పెట్టి స్పీక్రరు వైఖరిని నిలదీస్తే ఆయనకు గౌరవం దక్కుతుంది. లేదా.. అబద్ధాలతోనే ఆయన రోజులు నెట్టుకొస్తున్నారని ప్రజలందరూ భావించాల్సి ఉంటుంది.