మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకూ పార్టీ మీద ఉత్సాహమే సన్నగిల్లిపోతోందేమోననే అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లోనే కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఇటు తాడేపల్లి ప్యాలెస్ కు, అటు యలహంక ప్యాలెస్ కు మధ్య తిరుగుతూ ఉంటారు తప్ప ప్రజల్లోకి వెళ్లడం లేదు. మహా అయితే మార్గమధ్యంలో ఇడుపులపాయకు వెళ్తారు. అక్కడి ప్రజలను సెలక్టివ్ గా కలుస్తారు. ప్యాలెస్ నుంచి బయటకు కదలకుండా.. ఎక్స్ ఖాతాలో ట్వీట్లు పెట్టడం తప్ప.. ప్రజల్లోకి వెళ్లి పార్టీ గళాన్ని వినిపించకుండా, ప్రజల కష్టాలను గమనించకుండా.. జగన్ తమ పార్టీని వచ్చే ఎన్నికల దాకా ఎలా కాపాడాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని పార్టీ వారు భయపడుతున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి ఓడిపోయిన తర్వాత చాలా చిత్రంగా మారిపోయింది. పార్టీ కార్యకర్తలు ఎవరైనా మరణించినప్పుడు.. ఆ చావులో అధికార పార్టీ మీద బురద చల్లడానికి ఏదైనా ‘ఎలిమెంట్’ దొరుకుతుందనే విశ్వాసం ఉన్నప్పుడు తప్ప.. ఓడిపోయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో ఆయన ప్యాలెస్ దాటి ప్రజల మొహం చూడలేదు. పోనీ ప్యాలెస్ వద్దనైనా ప్రజలనుంచి విజ్ఞప్తులు స్వీకరించే.. ప్రజల కష్టాలు వినే కార్యక్రమం ఏదైనా చేస్తున్నారా? అంటే అది కూడా లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమ తమ కార్యాలయాల్లో ప్రజల వినతులు స్వీకరించే పనిచేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అంత బిజీగా ఉండే వారే చేస్తున్నప్పుడు.. ప్రతిపక్షహోదా కూడా లేకుండా ఖాళీగా ఉన్న జగన్ కు ప్రజల వినతులు స్వీకరించడానికి బాధేంటి.. అనేది ఆ పార్టీ వారి ఆందోళన.
ప్యాలెస్ కదలకుండా ఆయన ఏం చేస్తుంటారు? పార్టీ నాయకులను సెలక్టివ్ గా తన వద్దకు పిలిపించుకుని మాట్లాడుతుంటారు. పార్టీలో లోపాలు చెప్పేవారికి, సలహాలు ఇచ్చేవారికి ఎంట్రీ దొరకదు. చెప్పింది వినేవారికి మాత్రమే ఎంట్రీ. వారిని పిలిచి నాలుగు మాటలు మాట్లాడి.. పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించినట్టుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అంతే అక్కడితో మమ అనిపిస్తారు.
ఎవరో తయారుచేసిన పాయింట్లను ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తారు. అందులో ఏమాత్రం కొత్తదనం ఉండదు. ఎంతసేపూ చంద్రబాబు ప్రభుత్వం దండగ, ప్రజలు తిరస్కరిస్తున్నారు, ఓడిస్తారు.. మనమే అధికారంలోకి వస్తున్నాం, బాబు మోసాలను మరింత ఎండగట్టాలి, సూపర్ సిక్స్ అమలు కాలేదు.. లాంటి పడికట్టు పదాలే ఉంటాయి. ఒకవైపు సూపర్ సిక్స్ హామీలన్నీ ఒక్కటొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయి. ఆ సంగతి ప్రజలకు అర్థం అవుతోంది. కానీ.. ప్యాలెస్ కదలకుండా కనీసం పత్రికల్లో వార్తలు చూడకుండా ఉంటున్నారేమో అనిపించేలా జగన్ కు మాత్రం అర్థం కావడం లేదు. జగన్ వ్యవహార సరళి ఇలాగే ఉంటే.. వైసీపీ ముందు ముందు మరింతగా దిగజారుతుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
జగన్ స్టయిల్: ప్యాలెస్ నుంచి కదలరాదు, ఎక్స్ ను వీడరాదు!
Sunday, February 16, 2025
