దేశాన్నే కుదిపేస్తున్న మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అరెస్టు అయి ప్రస్తుతం రిమాండులో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారా? అయితే గియితే పార్టీ నాయకులు మరికొందరు జైళ్లకు వెళ్లడమే తప్ప.. సాక్ష్యాధారాలు అన్నీ చాలా బలంగా ఉన్న ఈ లిక్కర్ కుంభకోణంలో ఒకసారి అరెస్టు అయిన వారు అంత త్వరగా బయయటకు రావడం కుదరదని జగన్ విశ్వసిస్తున్నారా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఎందుకంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చెవిరెడ్డి ఏయే హోదాలతో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారో.. ఆ బాధ్యతల్లోకి జగన్ మరొక నాయకుడిని ఎంచుకున్నారు. మరొకరిచేతిలో ఆ బాధ్యతలన్నీ పెట్టారు.
చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. వైసీపీలో ఒక సాధారణ ఎమ్మెల్యేగానే ప్రస్థానం ప్రారంభించారు. అందరిలాగానే.. వైఎస్సార్ అభిమానిగా ఆ పార్టీలోకి వచ్చి.. జగన్ కు నెమ్మదిగా దగ్గరయ్యారు. జగన్ భజనలో, ఆయన ప్రీత్యర్థం అనేక రకాల పనులు చేయడం ద్వారా మరింత సన్నిహిత నాయకుడిగా చోటు సంపాదించుకున్నారు.
క్రమంగా చెవిరెడ్డి మాటకు జగన్ వద్ద విలువ పెరుగుతూ వచ్చింది. జగన్ కోటరీలో అప్పటిదాకా కీలక నాయకులుగా వెలుగొందుతూ వచ్చిన విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాటి వాళ్లకు కూడా చెక్ పెట్టే స్థాయికి చెవిరెడ్డి చేరుకున్నారంటే అతిశయోక్తి కాదు. అంతటి సాన్నిహిత్యం సొంతమైంది గనుకనే.. ఎన్నికల సమయంలో ఎక్కడెక్కడ దాచిన లిక్కర్ కుంభకోణం అక్రమ సొమ్ములన్నింటినీ.. తరలించి.. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులకు అందించే బాధ్యతను చెవిరెడ్డి చేతిలో పెట్టారు జగన్. పాపం.. చాలా డీల్స్ పూర్తిచేసినప్పటికీ.. ఎనిమిదిన్నర కోట్ల రూపాయలను లారీలో తరలించే ప్రయత్నంలో గుట్టు బయటపడింది.
ఆరాతీస్తే అనేక బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉండగా సిట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండులో పెట్టారు. ఆయన పోలీసు కస్టడీలో ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకపోయినా.. పోలీసుల వద్ద అనేక ఆధారాలున్నాయి. అవన్నీ చెవిరెడ్డి పాత్రను నిర్ధరిస్తున్నాయి.
ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత చెవిరెడ్డి ఇప్పట్లో జైలునుంచి బయటకు రాడు అని జగన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన ఆలూరు సాంబశివారెడ్డిని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. చెవిరెడ్డి ఇన్నాళ్లూ పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను కూడా చూస్తుండేవారు. ఆ బాధ్యతలను కూడా ఇప్పుడు సాంబశివారెడ్డి చేతుల్లోనే పెట్టారు. ఈ పరిణామం చెవిరెడ్డి భాస్కర రెడ్డి అభిమానులను ఖంగుతినేలా చేస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.