గురజాడ వారి కన్యాశుల్కంలో వెంకటేశం అనే మూర్ఖ బాలుడి కామెడీ పాత్ర ఉంటుంది. ఆ పాత్రకు చేగోడీలు అంటే ఇష్టం. ఏ టాపిక్ వచ్చినా సరే ఆ పాత్ర చేగోడీల వద్దకు వెళ్ళిపోతుంది. ఈ ప్రపంచంలో ఏమి ఉండును? అని అడిగితే ఆ పాత్రకు ముందుగా చేగోడీలే గుర్తుకు వస్తాయి. పోనీ ఇంకేదైనా హింట్ ఇచ్చి అడిగినా కూడా.. ఆ సమాధానం చెప్పి ఆ తర్వాతి మలుపులో చేగోడీల వద్దకు వెళ్ళిపోతాడు వెంకటేశం! అటువంటి కన్యాశుల్కం వెంకటేశం కంటే, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన తీరు భిన్నంగా ఏమీ కనిపించడం లేదు. రాష్ట్రంలో ఏ ఉపద్రవమైనా జరగవచ్చుగాక.. బ్రహ్మాండం బద్దలై పోవచ్చు గాక.. జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆ ప్రస్తావన తెచ్చిన మరుక్షణం తన ప్రతిపక్ష నేత హోదా గుర్తుకు వస్తుంది! క్యాబినెట్ ర్యాంకుతో చెలరేగాలనే ఆయన అత్యాశ కళ్ళ ముందు కదలాడుతుంది! నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే అలక.. ఎందుకు ఇవ్వరు అని అర్థం లేని నిలతీత.. ఆయన మాటల్లో దొర్లుకుంటూ వచ్చేస్తాయి! ప్రజలు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా దారుణంగా ఓడించి కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగా మూల కూర్చోబెట్టారు అనే వాస్తవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ లో లాజిక్ లేని గోలతో జగన్మోహన్ రెడ్డి తన పరువు తానే తీసుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఒక్క చాన్స్ ఇచ్చినప్పుడు కూడా ఆయన సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేశారు. ఆ సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధ్వంసం. ఆ మెయిన్ ఎజెండాకు ఆయన చేసిన పనులన్నీ కూడా ఉపఎజెండాలు అన్నమాట. అమరావతి రాజధాని దగ్గరినుంచి విశాఖ ఉక్కు వరకూ అన్నింటినీ సర్వనాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఉక్కు పరిశ్రమ ఆస్తులతో సహా సమస్తం అమ్మేయడానికి కూడా ప్రణాళికలు చేశారు. అన్ని దారుణాల్ని చూడలేక.. ప్రజలు ఓడించారు.
ఇప్పుడు ఆయనకున్నది మళ్లీ సింగిల్ పాయింట్ ఎజెండానే.. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కించుకోవడం. రాష్ట్రంలో ఏం జరుగుతున్నదనే పరిశీలన, అవగాహన కూడా లేకుండా.. ప్రజలకు ప్రతిపక్ష నాయకుడిగా తను అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదేమో ఆలోచించకుండా.. కేవలం అదొక్కటే తన జీవిత లక్ష్యం అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు.
సభలో రెండు పార్టీలుంటే ఒకరు పాలకపక్షం రెండోవాళ్లు ప్రతిపక్షం అంతే కదా.. అనేది జగన్ వాదన. అది నిజమే. ఆయన ప్రతిపక్షమే. ఆయన ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే. ఆ మాటకొస్తే ఆయనకొక్కడే కాదు.. ఒక్క సభ్యుడుతో ఒక కమ్యూనిస్టు పార్టీ ఉంటే గనుక.. వారిని కూడా ప్రతిపక్షం అనే అంటారు. ఆ ఒక్క ఎమ్మెల్యేని ప్రతిపక్ష నాయకుడు అనే అంటారు. కానీ.. కేబినెట్ సమాన హోదా కావాలంటే మాత్రం ఆయనకు కనీసం సభలోని మొత్తం సభ్యుల్లో పదిశాతం బలం ఉండాలి. ఈ లాజిక్ తెలియకుండా.. తన జీవితలక్ష్యం మొత్తం ప్రతిపక్ష నేత హోదా దక్కించుకోవడం మాత్రమే అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు… ఆయన పరువును గంగపాలు చేస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
లాజిక్ లేని పిచ్చి గోలతో పరువు తీసుకుంటున్న జగన్
Friday, March 28, 2025
