మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెనాలిలో పర్యటిస్తున్నారు. అక్కడ పోలీసుల దండనకు గురైన తన పార్టీకి చెందిన రౌడీషీటర్లను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి తగుదునమ్మా అని వెళుతున్నారు. దళితులైన ఆ రౌడీషీటర్లను పరామర్శిస్తే, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరాష్ట్రంలో దళితుల మీద ప్రభుత్వ దాడులు పెరుగుతున్నాయంటూ గొంతు చించుకుంటే ప్రజల్లో మైలేజీ వస్తుందని ఆయన దురాశకు పోతున్నట్టుగా కనిపిస్తోంది. కానీ.. పచ్చి రౌడీషీటర్లు అయిన, కానిస్టేబుల్ మీదనే హత్యాయత్నానికి తెగబడిన వారిమీద జగన్ సానుభూతి చూపిస్తే, వారికోసం పరామర్శ యాత్ర పెట్టుకుంటే.. ఆయనకు అంతో ఇంతో మిగిలిన పరువు కూడా పోతుందని ప్రజలు అనుకుంటున్నారు. దళితకార్డు ప్రయోగించాలనుకున్నా ఫలితం లేదని అంటున్నారు.
తెనాలిలో గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లకు పోలీసులు పలుమార్లు వార్నింగులు ఇచ్చారు. వైసీపీ నాయకుల అండదండలు చూసుకుని వారు రెచ్చిపోవడం మాత్రం మానలేదు. తమ దందాలు ఆపలేదు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి అనే కానిస్టేబులుపై తిరగబడి హత్యాయత్నానికి తెగించారు. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వారికి బహిరంగంగా లాఠీలతో అరికాళ్ల మీద కొట్టడం ద్వారా నాడా ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. ఇది కూడా చట్టప్రకారం తప్పే. అయితే జగన్ దీనిని చాలా పెద్ద రాద్ధాంతం చేసేయదలచుకున్నారు. కేవలం ఖండించడంతో ఊరుకోలేదు. రౌడీషీటర్ల కుటుంబాలను పరామర్శించడానికి ఏకంగా తెనాలి యాత్ర పెట్టుకున్నారు. గంజాయి అమ్ముకుంటూ యువతను నాశనం చేయడం మాత్రమే కాకుండా, పోలీసులమీద దాడిచేసే కొట్టే వారికి పరామర్శలు చేయడం కోసం ప్యాలెస్ నుంచి జగన్ బయటకు రావడం పలువురికి విస్మయం కలిగిస్తోంది. దీనిద్వారా ఆయన పరువు మరింత పోతుందని అంటున్నారు.
దాడికి గురైన కానిస్టేబుల్ భార్య కల్యాణి కూడా దళితురాలే. తన భర్తను వైసీపీ గూండాలు కొట్టినప్పుడు మీకు దళితకోణం గుర్తురాలేదా అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
పైగా రౌడీషీటర్ల విషయంలో కులం రంగు పులిమి ప్రయోజనం పొందాలనుకోవడం జగన్ చవకబారుతనానికి పరాకాష్ట అనే విమర్శలు కూడా వినవస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా.. పోలీసులపై హత్యాయత్నం చేసిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లడం ద్వారా.. రాష్ట్రమంతా తమ పార్టీ కార్యకర్తలు పోలీసులపై దాడులు చేయాలని, వారికి తన అండదండలు పుష్కలంగా ఉంటాయని సంకేతాలు ఇవ్వడానికి జగన్ ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
జగన్ తీరే అంత.. తప్పుడు మనుషులకే అండదండలు!
Thursday, June 19, 2025
