మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా తన పార్టీలోకి వచ్చిన నాయకుడి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. పార్టీలోకి వచ్చీ రాకముందే.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తద్వారా తనను ఇరుకున పెట్టడం ఆయనకు నచ్చడం లేదుట. ఒకవైపు వరుస కట్టి పార్టీలోని నేతలందరూ వెలుపలికి వెళ్లిపోతోంటే.. అతి కష్టమ్మీద ఒకరిని తన పార్టీలో చేర్చుకోగలిగారు జగన్మోహన్ రెడ్డి. అయితే సదరు లీడరు మాటతీరుతో కొత్త తలనొప్పులు వచ్చేలా ఉన్నాయని భయపడుతున్నారట. దళిత వర్గానికి చెందిన కీలక నేత అయినప్పటికీ.. ఆయనకు ప్రయారిటీ ఇవ్వకుండా లూప్ లైన్లో పెట్టాలని తన వారికి పురమాయిస్తున్నారట. తాడేపల్లి వర్గాల నుంచి గుసగుసలుగా వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి.. జగన్ ఆగ్రహానికి గురవుతున్న సదరు కొత్త నాయకుడు ఎవరో తెలుసా.. మాజీ మంత్రి సాకే శైలజానాధ్.
మొన్నమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా కూడా పనిచేసిన సాకే శైలజానాధ్.. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఇటీవలే ఆయన కాంగ్తెసును వీడి జగన్ పంచన చేరారు. అయితే ఆయన అనంతపురంలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంకా చురుగ్గా ఉన్న వైఎస్ విజయమ్మ.. వైఎస్సార్ కాంగ్రెస్ సారథ్యం స్వీకరించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఆస్తుల విషయంలో గొడవ పెట్టుకుని.. తల్లితో కూడా విభేదించి ఉన్న జగన్మోహన్ రెడ్డికి శైలజానాధ్ మాటలు సహజంగానే ఆగ్రహం కలిగించాయని సమాచారం. తల్లికి రాసిచ్చిన ఆస్తులు కూడా.. తిరిగి తనకు చెందాలంటూ ఆయన ప్రస్తుతం ట్రిబ్యునల్ లో పిటిషన్ నడుపుతున్నారు. జగన్ అబద్ధాలు చెబుతున్నారని, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇష్టానికి వ్యతిరేకంగా కుటుంబ ఆస్తులు మొత్తం తానే తీసుకోవాలని అనుకుంటున్నారని వైఎస్ విజయమ్మ బహిరంగంగా తెలియజెప్పారు కూడా. అప్పటినుంచి తల్లీకొడుకుల మధ్య సత్సంబంధాలు లేవు.
వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో ఇడుపులపాయ సమాధి వద్ద కలవడం తప్ప.. ముద్దులు పెట్టుకోవడం తప్ప తల్లీ కొడుకులు ఎడమొగం పెడమొగంగానే ఉన్నారు. వైఎస్ విజయమ్మ పార్టీ ప్లీనరీలో తన గౌరవాధ్యక్ష పదవికి అనూహ్యంగా రాజీనామా ప్రకటించినప్పుడే.. ఇంట్లో తెలియని విభేదాలు రగులుతున్నట్టు అంతా అనుమానించారు. ఆ తర్వాత చాలా కాలానికి అవి బయటపడ్డాయి. తర్వాత తారస్థాయికి వెళ్లాయి.
ఇంత జరుగుతోంటే.. ఇప్పుడు సాకే శైలజానాధ్ నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి.. కుటుంబంలో రాజీ కుదిర్చే పెద్దమనిషిలాగా.. విజయమ్మ పార్టీ సారథ్యం తీసుకోవాలని వ్యాఖ్యానించడం జగన్ కు ఆగ్రహం తెప్పించింది. శైలజా మాటలు.. తన పార్టీ నాయకత్వ సామర్థ్యాన్ని హేళన చేసేలా ఉన్నాయని జగన్ ఉడికిపోతున్నారట. శైలజా పాపం.. ఏం ఆశించి ఈ మునిగిపోయే పార్టీలోకి వచ్చారో గానీ.. ఆయన కోరిక నెరవేరడం కష్టమేఅని జగన్ తీరు తెలిసిన పార్టీ వర్గాలు అంటున్నాయి.
తల్లి పేరెత్తిన శైలజాపై జగన్ గుస్సా!
Thursday, March 20, 2025
