రాష్ట్రంలో మిర్చి రైతులు మార్కెట్ ధర గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. అంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున ఉండాలని, వారికి మద్దతుగా గళం వినిపించాలని జగన్ అనుకున్నారు.. అది ఆయన బాధ్యత కూడా! మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గుంటూరు మిర్చి యార్డును మాత్రమే సందర్శించాలని ఎందుకు అనుకున్నారు? రాష్ట్రంలో రైతులు విస్తారంగా మిర్చి పండించే ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. కనీసం కర్నూలుకు వెళ్లి అక్కడి మిర్చి రైతులను పరామర్శించి ఉండవచ్చు. కేవలం పరామర్శతో ఆగకుండా, వారి తరఫున అధికారికంగా ప్రదర్శనలు, సభలు కూడా చేసి ఉండవచ్చు. కలెక్టరుకు వినతిపత్రాలు ఇచ్చి ఉండొచ్చు.. కానీ.. చట్టసమ్మతంగా జరిగే అలాంటి పోరాటం జగన్ కు ఇష్టం ఉండదు. చట్టాన్ని, నియమాల్ని ఉల్లంఘించే అతిక్రమించే వివాదాలు మాత్రమే ఆయనకు కావాలి. అందుకే జగన్.. గుంటూరు మిర్చి యార్డునే సందర్శించారని ప్రజలు అనుకుంటున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ నుంచి కదలకుండా.. రెండు వారాలకు ఒకసారి బెంగుళూరు యలహంక ప్యాలెస్ యాత్ర మాత్రమే నిర్వహిస్తూ గడుపుతున్న రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్ వల్లభనేని వంశీని కిడ్నాపు కేసులో అరెస్టు చేసేసరికి ప్యాలెస్ వీడి బయటకు వచ్చారు. జైలుకు వెళ్లి వంశీని పరామర్శించి.. పోలీసులపై నానా కారుకూతలు కూశారు. అదే సమయంలో.. ఒకవైపు మిర్చి రైతులు ఇబ్బంది పడుతోంటే.. కనీసం అటువైపు తిరిగిమళ్లి చూడలేదు గానీ.. వంశీని పరామర్శించడానికి మాత్రం వీలు చిక్కిందా అంటూ విమర్శల పాలయ్యారు. ఆ మరురోజే గుంటూరు మిర్చియార్డు సందర్శన పెట్టుకున్నారు.
కానీ గుంటూరు-కృష్ణా జిల్లాలకు సంబంధించి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మిర్చి యార్డు సందర్శన లాంటి కార్యక్రమాలు నిర్వహించడం కుదరదని, నియమాలకు కోడ్ నిబంధనలకు విరుద్ధం అని పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ.. జగన్ ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోడ్ ఉల్లంఘించినందుకు ఆయనతో సహా మరో ఎనిమిది మంది వైసీపీ నాయకులమీద కేసు నమోదు అయింది. జగన్ కోరుకునేది కూడా ఇలాంటి వివాదమే.
నిజానికి రాష్ట్రంలో మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు ఇంకా అనేకం ఉన్నాయి. జగన్ కు ఆ సంగతి తెలియకపోతే.. తమ చానెల్ ప్రతినిధుల్ని అడిగినా చెప్పేవాళ్లు. ఎందుకంటే.. వివిధ ప్రాంతాలనుంచి మిర్చి రైతుల కష్టాలను వారు భూతద్దంలో చూపిస్తున్నారు. జగన్ గుంటూరు యార్డులో డ్రామాలు చేయకుండా.. కనీసం సమీపంలో ఉండే కర్నూలు మిర్చి యార్డు వద్దకు వెళ్లి ఉన్నా సరే.. అక్కడ కోడ్ నిబంధనలు లేవు గనుక.. చక్కగా పోలీసు భద్రతతో పరామర్శలు, సభలు, ప్రదర్శనలు అన్నీ నిర్వహించి ఉండవచ్చు. కానీ.. జగన్ కు నియమాలను పాటించడం నచ్చదని, అన్నింటినీ ఉల్లంఘించడంలోనే మజా ఉన్నదని అనుకునే బాపతు నాయకుడని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్: వివాదమే ఇష్టం.. సమస్య- పరిష్కారం కాదు!
Thursday, March 20, 2025
